అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ - 1

"నాన్నా, దిగులు పడకురా.. ప్రతి నెలా నిన్ను చూడడానికి వస్తాంలేరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. రోజూ తలకి నూనె రాసుకో. త్వరగా పడుకో. తెల్లవారుఝామునే నిద్ర లే. బాగా చదువు. చదువులే మనకు ఆస్తులు......." అంటూ మా అమ్మ మొదలుపెట్టిన సూక్తిముక్తావళిలో నా బుల్లి మెదడు కొట్టుకుపోతోంది. మామూలుగా తన మాటలు అసలు పట్టించుకోని నేను రోజు అదేదో సినిమా కథ వింటున్న హీరో లాగా ఉండిపోయా. తరవాతి రోజు నుండి హాస్టల్లో ఉండబోతున్నాననే  కాబోలు. ఇంట్లో ఉంటే అన్నీ తనే చేస్తుంది, కాకపోతే హాస్టల్లో చెయ్యడానికి ఎవ్వరూ ఉండరు కదా. పైగా నేను శ్రద్దగా వింటుంటే మా నాన్నగారు అదేదో ప్రపంచంలో ఎనిమిదో వింతలాగ నావైపు చూడడం మొదలుపెట్టారు. ఇదంతా మా ఎదురింటాయన వల్ల వచ్చింది. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టాననో, లేక ఆయన స్కూటర్ టైర్లల్లో గాలి తీసేవాడిననో, ఆయనకి నేనంటే పడదని నాకు ఎప్పుడూ అనిపించేది, అది ఇప్పుడు నిజమని అనిపిస్తోంది

ఒకానొక చల్లని సాయంత్రం మా అమ్మ నాన్నగారు వాకింగ్ కి వెళ్లినప్పుడు నాకు శనిలాగ, వాళ్లకి ఆయన తగిలాడు. ఇంకేముంది? చిత్తు కాగితాలనుండి చెత్త రోడ్లదాక, పక్కింటి పరంధామంగారి నుండి పార్లమెంట్లో ప్రధానమంత్రిదాకా వారు చర్చించని అంశమే లేదు. ఎన్నున్నా సరే, ఈనాటి తల్లిదండ్రులను మైమరపించే ముఖ్యమైన అంశాలు రెండు; పిల్లల చదువులు, పెళ్లిళ్లు. ఇంక వారి ఆలోచనాప్రవాహానికి ఆనకట్ట వేసేవారే లేకుండా పోయారు. మా అమ్మయితే రోజులు బాగాలేవని, మంచి మార్కులు తెచ్చుకోకపోతే మంచి భవిష్యత్తే లేదని అంటే, దొరికిందే సందని ఆయన రెచ్చిపోయి మరీ మాట్లాడటం మొదలుపెట్టాడు. చదువుకోకపోతే మంచి కాలేజిలో సీటు రాదని, అది లేకపోతే మంచి ఉద్యోగాలు అస్సలు దొరకవని, సర్టిఫికెట్లు చేతబట్టుకుని రోడ్లవెమ్మట తిరగాలని, ఒక దెయ్యం సినిమా అక్కడికక్కడే తీసి చూపించేశాడు.

దృశ్యాన్ని ఊహించుకుంటూ మా అమ్మ, అదేదో దోష నివారణ కోసం యజ్ఞాలు చెయ్యాల్సినట్టు దిగాలుగా ఏం చెయ్యలి అని అడిగింది. ఇంక ఆయన ఊరుకుంటాడా, చిత్రగుప్తుడి చిట్టా విప్పి రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కళాశాలలన్నిటినీ కళ్లకు కట్టినట్టు చూపించేశాడు. అక్కడ చేర్పిస్తే వాళ్లే అన్నీ చూసుకుంటారని, నూటికి తొంభై తొమ్మిది శాతం మార్కులు తెప్పించడమే వాళ్ల పని అని, తెగ నూరిపోశాడు. నా లాగ బేవర్స్ గా తిరిగే వాళ్ల అక్క కొడుకు వీటివల్ల ఎంత ప్రయోజకుడయ్యాడో వివరించాడు. ఇంకేం కావాలి? ఇక మా అమ్మ ఆయన ఇచ్చిన సలహాకి మురిసిపోతూ నన్నో గొప్ప స్థానంలో ఊహించుకుంటూ ఇంటికి వచ్చి బాంబు పేల్చింది. కట్ చేస్తే, ప్రస్తుతం.

మా అమ్మ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నన్ను తీసుకెళ్లి ఆ హాస్టల్లో దిగబెట్టారు. అక్కడ వార్డెన్ బక్కచిక్కిన కాటికాపరిలాగ ఉన్నాడు. తలకి ఏనాడూ తైలసంస్కారం చేసిన పాపాన పోలేదనుకుంట. చింపిరి జుత్తేసుకుని, చేతిలో ఒక గూర్ఖావాడి కర్ర పట్టుకుని వచ్చేపోయే విద్యార్థులందరినీ వాడి కంచుకంఠంతో బెదిరిస్తూ బెంబేలెత్తిస్తున్నాడు. మా నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్లి, "సార్, మా అబ్బాయి చాలా తెలివైన వాడు. కాస్త శ్రద్ద తక్కువ. ఎలాగోలాగ వాడు బాగా చడివి ర్యాంకు తెచ్చుకునేలా చెయ్యండి" అని చెప్పగా ఆయన "మీరు ఇంక అన్నీ మర్చిపోండి సార్. గాడిదని కూడా గుర్రాన్ని చెయ్యగల చరిత్ర ఉన్న కళాశాల సార్ మాది" అంటూ మా అమ్మానాన్నలని సాగనంపి వెంటనే నా వైపు ఒక రాజనాల లుక్కిచ్చి "ఇంక నే పనైపోయినట్లే. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి" అన్నాడు. అది చూడగానే NTR స్టైల్లో ఒక పెద్ద డైలాగు వదలాలనిపించినా, నన్ను నేను కంట్రోల్ చేసుకుని నా గదిలోకి వెళ్లిపోయా. మా అమ్మ నాన్న వెళ్లిపోగానే, ఇంక నా కన్నీరు కట్టలు తెంచుకువచ్చాయి. ఇక నన్ను నేను ఓదార్చుకుంటూ అలాగే గది మొత్తం సర్దుకున్నాను. అంత పెద్ద గదిలో అక్కడ నేను ఒంటరిగా నిలబడి ఉండటం చాలా వింతగా అనిపించింది. నా రూంమేట్స్ ఎవరెవరు ఉంటారో అని అనుకుంటూ ఉండిపోయా. రెండేళ్లు ఇంటికి దూరంగా ఉండాలన్న ఆలోచనే దుర్భరంగా ఉంది. అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ, ఆవకాయ అన్నం, నాన్న జేబులోంచి కొట్టేసే పాకెట్ మనీ, నాన్న పెట్టే చీవాట్లు, అమ్మ గారాబం, వీటన్నిటికీ దూరంగా రెండేళ్లా! అదీ చెత్త రూంలోనా... తలుచుకుంటేనే బాధగా ఉంది.

నా గదిలో ఇంకా రెండు మంచాలు ఉన్నాయి కానీ ఎవ్వరూ రాలేదు. దాంతో కాస్త చల్ల గాలికి తిరిగినట్లుంటుందని అలా గేటుదాకా వెళ్లగా, అక్కడ నాలానే ఇంకొకడు అమ్మానాన్నలకి టాటా చెబుతూ ఏడుస్తూ కనిపించాడు. నేనేదో హీరోలాగ వెళ్లి వాడిని ఓదారుస్తూ ధైర్యం చెబుతుంటే, వాడు బెంగతో ఏడవట్లేదని, మాకు మరుసటి రోజు మొదలు ప్రతిరోజూ ఉదయం 4:30 నుండి రాత్రి 11:30 వరకూ క్లాసులు ఉంటాయని, ఆటపాటలు, సినిమాలు, వినోదాలేవీ ఉండవని, ఇంక బతుకంతా చదువుతూనే ఉండాలని, అందుకనే ఏడుస్తున్నానని చెప్పాడు. అసలే కోతి, మీద దెయ్యం పట్టెను, మీద ఈతకల్లు తాగెను, మీద తేలు కుట్టెను అన్నట్టు, వార్త నాకు పిడుగుపాటు అయ్యింది. అయినప్పటికీ వార్త పుకారై ఉంటుందని నాకు నేనే ధైర్యం చెప్పుకుని, మళ్లి కట్టలు తెంచుకుబోతున్న నా దుఃఖానికి ఆనకట్ట వేసుకుంటూ నా గది వైపుకి నడవడం మొదలుపెట్టా.

అలా ఈడ్చుకుంటూ గదికి వచ్చిన నాకు లోపల ఇంకొకడు కనిపించాడు. తన పేరు గోపాల్ అని పరిచయం చేసుకున్నాడు. తను అక్కడ గత సంవత్సరంనుండే ఉంటున్నాడట. 10 తరగతి తర్వాతే చేరాడట. అది విన్న నాకు వీడికి కూడా నాకున్నట్టే ఒక చెత్త ఎదురింటివాడు ఉన్నట్టు, వాడికి వీడంటే పీకలదాకా కోపం ఉన్నట్టు, వీడి తల్లిదండ్రులకు ఇలాంటి సలహా ఇచ్చి వీడి పీడ వదిలించుకున్నట్టు కనిపించి ఒక్కసారిగా ఫక్కున నవ్వేశా. పాపం నా నవ్వుకు అర్థం తెలీక కంగారుపడ్డాడు గోపాల్. బహుశా జీవితం అంటే ఇంతే కాబోలు.
"హాస్టల్ కి కొత్తా?" అడిగాడు గోపాల్.
"అవును" అంటూ తలూపా నేను.
గోపాల్ ఏదో అనబోతుండగా ధబాలున తలుపు తెరుచుకుంది. ఒక బక్కచిక్కిన కుర్రాడు ప్రపంచంలో ఉన్న సామానంతా మోసుకుంటూ లోపలికొచ్చాడు.
"హాయ్, నా పేరు ప్రభు. వార్డెన్ సంతకం కావాలి. ఎక్కడ కలవాలో కొంచెం చెప్పవా" అని అడిగాడు.
"తిన్నగా వెళ్లి ఎడమ పక్కకి తిరుగు. వసారాలో చివరికీ ఉన్న గదిలో ఉంటాడు," అన్నాడు సర్వజ్ఞాని అయిన గోపాల్.
అలా వెళ్లిన ప్రభు అరగంట తర్వాత తిరిగొచ్చాడు. తన రైలు ఆలస్యంగా నడిచిందని, దాంతో సమయానికి రాలేకపోయాడని, తన ప్రయాణ గాధని వర్ణించుకొచ్చాడు. ఇంక ఒకళ్లనొకళ్లు పరిచయం చేసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోయాం. ఇంతలో గోపాల్ "సమయం మించిపొతోంది. వార్డెన్ మనల్నందర్ని 8:30 కి కలుస్తానన్నాడు. ఏదో మాట్లాడాలట. కాబట్టి త్వరగా భోజనం చేసి వద్దాం పదండి" అన్నాడు

భోజనం ముగించుకుని, వార్డెన్ చెప్పిన సోది విని తిరిగొచ్చేసరికీ 10:30 అయ్యింది. తిండి ఫర్వాలేదనిపించినా, మా దినచర్య మాత్రం దారుణంగా అనిపించింది. ఇంతకీ వార్డెన్ మమ్మల్ని పోటీ పరీక్షలకే చదివిస్తున్నాడా, లేక ఎదైనా కోవర్ట్ ఆపరేషన్ కోసం పని చేయిస్తున్నాడా అన్నట్లు ఉంది షెడ్యూలు. ఇంక నా కళ్లు మూతలు పడుతూండటంతో నడుం వాల్చాం. "ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది" అన్న మాటలో ఎంత నిజం ఉందో అనుకుంటూ, రాబోయే సంవత్సరంలో నా జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నా.

(సశేషం...)

దీనికి తర్వాత తొలిప్రేమ - 2 చదవండి.


నా స్నేహితుడు రచించిన ఆంగ్ల బ్లాగ్ లింక్ క్రింద ఇస్తున్నాను.

Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

9 comments :

  1. you took me back to 20 years. i expect to see naughty things in next episodes.

    రిప్లయితొలగించండి
  2. Thanks everyone..

    @ Kedar: I can promise you something interesting in the episodes to come..

    @ Ravi: Naughty, hmmm.. well.. hav to see..

    రిప్లయితొలగించండి