అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ - 2

దీనికి ముందు తొలిప్రేమ - 1 చదవండి.

మొట్టమొదటి రోజు.. క్లాసు మొదలయ్యేసరికి మేమంతా మెదడువాపు వ్యాధి వచ్చిన వాళ్లలాగా ఉన్నాము. మొదటి క్లాసు కావడంతో అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో టీచరు రానే వచ్చింది. రాగానే పరిచయం చేసుకుని మమ్మల్ని కూడా ఒక్కొక్కరినీ పరిచయం చేసుకోమంది. కార్యక్రమం పూర్తవ్వగానే పాఠం మొదలుపెట్టేముందు తన పూర్వానుభవం గురించి, తన గత విద్యార్థుల గురించి, చెప్పడం మొదలుపెట్టింది. దాంతో నేను ఉండబట్టలేక (అంటే సినిమాలు ఎక్కువగా చూస్తాను కదా, పైగా ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ కళాశాలలో చదివిన అనుభవం కూడా తోడై) "అందరూ చెప్పేదే కదా. కొత్తగా ఎదైనా చెప్పండి మేడమ్" అని అనేశాను. దాంతో కలకత్తా కాళీ లాగ వీరంగమెత్తుతూ విరుచుకుపడింది నా మీద. ఏం చెయ్యాలో తెలియక చేతిలో ఉన్న డస్టర్ తీసుకుని నా మొహం మీదకి విసిరింది. అది ధబాలున వచ్చి తగలడంతో నాకు మా అమ్మ గుర్తొచ్చింది.

"అమ్మా!!! బాబోయ్!!!" అని అరుస్తూ తలకి చెయ్యి అడ్డు పెట్టుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచా. చుట్టూ చూస్తే చీకటి. బయ్యిమంటూ అలారం చప్పుడు. ఇదంతా కలా, అని అనుకున్నా కాని నొప్పి మాత్రం నిజంగానే విపరీతంగా ఉంది. తీరా జరిగిందేంటంటే మా గోపాల్ గాడు అలారం ఆపుదామని ప్రయత్నిస్తే ఎంతసేపటికీ ఆగలేదని తీసి నిద్రలో విసిరి కొట్టాడట. అది వచ్చి నా తల బద్దలుకొట్టింది. ఏం చేస్తాను? నా టైం బాగోలేదని అనుకుంటూ లేచి టైం చూస్తే 4:15. ఐదు గంటలకి స్టడీ అవర్స్ మొదలవుతాయి.

"...... టి... రా..... చప్పు….డు..."  ప్రపంచంలో ఉన్న నీరసమంతా గొంతులోనే ఉందేమో అన్నట్టు వినిపించింది మా ప్రభు గాడి గొంతు. కష్టపడి వాణ్ణి నిద్రలేపి నేను స్నానానికి వెళ్లాను. తిరిగి వచ్చేసరికి ప్రభు మెలకువగానే ఉన్నాడు కాని గోపాల్ మాత్రం చచ్చిన శవంలాగ పడున్నాడు.

"సచ్చినోడా... లేరా రేయ్... నా నిద్ర చెడగొట్టి, బుర్ర బద్దలగొట్టి ఎంత హాయిగా నిద్రపోతున్నావో" అంటూ నా పగంతా తీర్చుకున్నట్లు నడ్డిమీద ఒక్క తన్ను తన్నా. పాపం వాడిక్కూడా వాళ్ల అమ్మ గుర్తొచ్చినట్టుంది. "అమ్మా..." అంటూ గట్టిగా కేక పెట్టి లేచి కూర్చున్నాడు.

కొత్త పుస్తకాలు, కొత్త బట్టలు, కొత్త సంచీ, వెరసి, కొత్త పెళ్లికొడుకుల్లాగ తయారయ్యి ముగ్గురం క్లాసుకు బయలుదేరాం. దారిలో భోజనశాల(మెస్)లో పాలు తాగడానికి వెళ్లాం. సున్నపునీళ్లలా ఉన్న పాలని అమృతంలా మార్చిన గోపాల్ గాడి బోర్నవిటా గురించి మాట్లాడుకుంటూ స్టడీ అవర్ లోకి వెళ్లి కూర్చున్నాం. ప్రదేశాన్ని చూడగానే యుద్ధఖైదీలని చెరసాలలో బంధించి వారికి సమయపాలన, క్రమశిక్షణ, నిబద్ధత లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తున్నట్లు అనిపించింది. మా కుర్చీలని ఈడ్చుకుంటూ మాకోసం నియమించిన జాగాలో కూర్చున్నాం. జైలులాంటి ప్రదేశంలో నాకు ఊరట కలిగించే విషయం ఏదైనా ఉందంటే, అది గోపాల్, ప్రభు, నాతో ఉన్నారనే. ఒక్కరోజులోనే వాళ్లిద్దరూ నాకు బాగా దగ్గరైపోయినట్లు అనిపించింది. ప్రభు ఒక 'అయోమయం జగన్నాధం' లాంటివాడు. గోపాల్ చూస్తే 'బిందాస్'.

"మొదటిరోజు కాబట్టి ఊరుకుంటున్నాను. రేపటినుండి ఎవరైనా ఆలస్యంగా వచ్చారంటే చెమడాలు ఒలిచేస్తా" అంటూ మళ్లీ అదే కంచుకంఠం. ఇంకెవరు? పొద్దున్నే మొదలైందా గోల, అనుకుంటూ పుస్తకాలు తీసి చదవడం మొదలుపెట్టాం. "మనిషికి పూర్వానుభవం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది" అని మహానుభావుడన్నాడో కాని, మా గోపాల్ విషయంలో అది ఖచ్చితంగా నిజం. ఒక సంవత్సరంనుండి హాస్టల్లో ఉన్నందుకు వాడి పంచేంద్రియాలు ఒకదానితో ఒకటి బాగా సహకరించుకుంటున్నాయి. తనకి కూడా తెలియకుండా నిద్రపోగల మాయగాడు గోపాల్. ఒకపక్క మిగతావాళ్లు పాపం తూగుతూ వార్డెన్ కి దొరికిపోయి తిట్లు తింటుంటే మరోపక్క మావాడు మంచి స్లీపేసేస్తున్నాడు. వాడు పడుకున్నట్లు వాణ్ణి చూస్తే ఎవ్వరికీ అనిపించదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే, కావాలంటే నిలబడైనా, ఆఖరికి కళ్లు తెరిచి కూడా నిద్రపోగల సమర్ధుడు.

అక్కడ తిట్లపురాణం ముగించుకుని ఇటుగా వస్తున్న వార్డెన్ ని చూడగానే ప్రభుకి ముందే వణుకు పుట్టింది. దానికితోడు, సరిగ్గా వార్డెన్ మూడడుగుల దూరంలో ఉండగా నిద్రపోతున్న గోపాల్ ఒక్కసారిగా లేచి ప్రభువైపుకు తిరిగి "ఒరేయ్, ఆర్గానిక్ మెటల్స్ చాప్టర్లో బెంజీన్ ఫార్ములా గురించి ఇచ్చాడు కదా, అది ఒకసారి చెప్పవా" అని అడిగాడు. ఇంకేముంది, మన హీరో బిత్తరచూపులు. అది చూసిన వార్డెన్ ప్రభు దగ్గరికి వెళ్లి "అడుగుతున్నాడుగా, చెప్పు.." అన్నాడు. ఎంతసేపటికీ జవాబు రాకపోయేసరికి "గోపాల్ ని చూసి సిగ్గు తెచ్చుకో. ఇప్పటికైనా వాడిలా చదవడం నేర్చుకో. బాగుపడతావ్" అని తన స్టైల్లో ఉపన్యాసం ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రభు ఇంక కోపం తట్టుకోలేక గోపాల్ ని తిట్టేలోపే శ్రీ శ్రీ శ్రీ నిద్రానందస్వామి వాణ్ణి ఆవహించేశాడు.

ఇన్ని ఝలక్ లతో మొదలైన మొదటిరోజు స్టడీ అవర్ ముగించుకుని టిఫిన్ చెయ్యడానికి వెళ్లాం. అక్కడ చూడాలి, బండరాళ్లలాంటి ఇడ్లీలు, టెన్నికాయిట్ రింగ్ లాంటి వడలు కనిపించాయి. పక్కన చూస్తే నీళ్లలో రంగేసినట్లు ఉంది వేరుశనగ పచ్చడి. ఇంకోపక్క నీళ్లమీద తేలుతూ ఉల్లిపాయలు కనిపించాయి. అది సాంబార్ కాబోలు అనుకున్నా. ఇంట్లో పంచభక్ష్యపరవాన్నాలు అలవాటైన నాకు అక్కడ వైతరణీ నది కనిపించింది. జన్మలో చేసిన పాపం జన్మలోనే అనుభవించాలన్నది కలియుగధర్మం కదా అని అప్పుడు నాకనిపించింది. అంత రొచ్చులోంచి ఏదో కష్టపడి కడుపు నింపుకుని తొమ్మిదింటికల్లా క్లాసుకి బయలుదేరాము.

(సశేషం)

దీని తర్వాత తొలిప్రేమ - 3 ని చదవండి.
Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

6 comments :