అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ – 4

దీనికి ముందు తొలిప్రేమ - 3ని చదవండి.


తను ఎదురుపడిన ప్రతిసారీ పక్కకి తప్పుకునిపోయే నాకు ఒకరోజు మా గోపాల్ గాడు వాడి తరహాలో ఇంకో ఉచిత సలహా పడేశాడు. "ఒరేయ్ విక్రమ్, ఒకసారి తనతో మాట్లాడొచ్చు కదా.. కనీసం తనపట్ల నీకున్న ఫీలింగ్స్ బయటపెట్టు. ఇంతకన్నా మంచి అవకాశం నీకు దొరకదు.. ఆలస్యం చేస్తే ఎవడైన వచ్చి తన్నుకుపోతాడు. చివరకు నీకు మిగిలేది నెత్తిన తెల్ల గుడ్డే..." సినిమాలు బాగా చూస్తాడేమో, వాడు చెప్పిన విధానానికి నాకు ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. సరే, ఇంక చేసేదేమీ లేక ఇంక ఆ ఆదివారం వారాంతర (వీకెండ్) పరీక్ష అయ్యాక చెబుదామని అనుకున్నా.
పరీక్ష అయ్యాక అనుకోకుండా తను ఎదురుపడింది. ఇదే అవకాశం అని తన వెనుకే వెళ్లి పిలవబోయాను. అదేదో ఏళ్లతరబడి ఎడారిలో నీళ్లు దొరక్కపోతే గొంతు ఎలా ఎండిపోతుందో, ఆ విధంగా నా గొంతు ఎండిపోయింది. నాలుక మడతపడింది, మాట తడబడింది. తనని పిలిచిన పిలుపు నాకే వినపడకుండాపోయింది. దాంతో నా ప్రయత్నాన్ని విరమించుకుని నా గదికి తిరిగొచ్చేశాను.
నా బాధ తెలుసుకున్న గోపాల్ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. తనదైన శైలిలో "మావా, గాంధీగారు ఒకానొకప్పుడు అన్నార్రా - నీ మిత్రులని చూపించు, నువ్వెలాంటివాడివో నేను చెప్పగలను, అని. అదే విధంగా ముందు తన స్నేహితురాళ్లని కలిసి, మంచి చేసుకుని వాళ్లకి కీర్తన పట్ల నీకున్న భావాలని చెప్పు. మిగతా కథంతా వాళ్లే నడుపుతారు. తేడా వస్తే నేను చూసుకుంటాను." అని అన్నాడు. ఒకపక్క గాంధీగారు, ఇంకోపక్క మా గోపాల్, మరోపక్క అయోమయంలో నేను. ఏదీ చెయ్యకపోవడంకన్నా ఏదో ఒకటి చెయ్యడం మేలని వాడిచ్చిన సలహాకి సరేనన్నాను. "భయమెందుకురా.. నేనున్నాను నీ ప్రేమను గెలిపించే పూచీ నాది" అంటూ హీరోలాగ మద్దతిచ్చాడు. రెండు వారాలు గడిచాయి. నాకోపక్క ఏమైందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. ఇంతలో ప్రభు ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే గోపాల్ కి కీర్తన స్నేహితురాలైన గీత అంటే ఇష్టమని. చివరకు నాకర్థమైనదేంటంటే ఈ సీన్ లో బకరా గాణ్ణి నేనే అని.
ఆ రోజు జాగింగ్ చేసి అలసిపోయి తిరిగొచ్చిన గోపాల్ తో "ఏంట్రా.. ఎందాకా వచ్చిందేంటి నీ ప్రేమ సంగతి??" అని అడిగేశాను. దాంతో వాడు రేయ్, తప్పుగా అనుకోకురా. ఇదంతా నీకోసమే, అంటూ ఆ మరుసటి రోజు గీతని నాకు పరిశయం చేస్తానని చెప్పాడు. అనట్టుగానే, గీతని పరిచయం చేశాక కీర్తన గురించి అడిగాడు. అప్పుడు గీత, "వచ్చే మంగళవారం కీర్తన పుట్టినరోజు. కాబట్టి, తనకి బాగా ఇష్టమైనది ఏదైనా బహుమతిగా ఇవ్వు. అప్పుడు తనతో బాగా మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది" అని అంది.
నీ అభిప్రాయం వ్యక్తపరిచేలా ఏదైనా సొంతంగా తయారుచేసి ఇస్తే బాగుంటుందని ప్రభు అన్నాడు. మా గోపాల్ కూడా దీనికి తలూపడంతో ఆ పనిలో మునిగిపోయాను. చివరకి ఒక చక్కని గ్రీటింగ్ కార్డు, ఒక చిన్న గులాబి పువ్వు (కాగితంతో) తయారుచేశాను. చివరకి ఆ రోజు రానే వచ్చింది. కొత్త పట్టు లంగా-వోణీలో మెరిసిపోతూ, చూసేవాళ్లకి మతి పోగొట్టేలా ఉంది కీర్తన. పుట్టినరోజునాడు క్లాసులో అందరికీ చాక్లేట్స్ పంచడం అక్కడ ఆనవాయితీ. అలా తను ఒక్కో బెంచీ దగ్గరికి వచ్చి చాక్లేట్స్ పంచుతోంది. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో నేనిక్కడ రిహార్సల్ మొదలుపెట్టేశాను.
"విష్ యూ హ్యాపీ బర్త్ డే కీర్తనా..." " ఛా.. చాలా మామూలుగా ఉంది"
"పుట్టినరోజు శుభాకాంక్షలు కీర్తనా.." " ఏంటది? ఏదో పద్యం పాడినట్లుగా.."
"మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే..." "మరీ ఇంత పెద్దదిగానా, నో. చిన్నగా హ్యాపీ బర్త్ డే అని చెప్పేద్దాంలే" అని నాలో నేను అనుకుంటూ ఉన్నాను. ఇంతలోనే తను నా దగ్గరిదాక వచ్చేసింది. కంగారులో "హ్యాపీ డే కీర్తనా" అని అనేశాను. అది విని, తనలో తానే ముసిముసినవ్వు నవ్వుకుంటూ వెళ్లిపోయి తన సీట్లో కూర్చుండిపోయింది. ఆ నవ్వులో మునిగిపోయిన నన్ను క్లాస్ అయిపోగానే గోపాల్ తట్టి లేపి తనకు ఆ గ్రీటింగ్ ఇమ్మని గుర్తుచేశాడు. తన వెనుకే వెళ్లి "కీర్తనా.. ఏదో, నీ బర్త్ డే కి ఒక చిన్న గిఫ్ట్. తీసుకో, కాదనకు." అని అన్నాను. ఆ గ్రీటింగ్ చూసి చిన్న నవ్వు నవ్వి వెళ్లిపోయింది. ఆ నవ్వు నా గుండెలో వేయి జన్మలకు సరిపడా చెరగని ముద్ర వేసింది.
ఇక ఆ తర్వాత వచ్చాయి. తొలి త్రైమాసిక పరీక్షలు. అందరూ చదువులో మునిగిపోయాము. పగలంతా క్లాసులోను, స్టడీ అవర్స్ లోను, రాత్రుళ్లు రూముల్లోను, చదువుకే అంకితమైపోయాము. మా టీచర్లు స్పెషల్ క్లాసులతో మమ్మల్ని, మా ఖాళీ సమయాన్ని తినేస్తుండటంతో నాకు తనని చూడటానికి అస్సలు సమయం దొరక్కుండా పోయింది. ఇక పరీక్షలముందు రోజు. తల తలకోనలోను, కాళ్లు కోనసీమలోను ఉన్నట్టు, తల మంచంమీద, కాళ్లు కుర్చీలో పెట్టి, వేళ్లాడుతూ నిద్రపోతున్నాడు మా గోపాల్. కాళ్లు మంచంమీద పెట్టి గబ్బిలంలా వేళాడుతూ నేలమీదే గురక పెట్టేస్తున్నాడు ప్రభు. నేను అతికష్టం మీద నా పాఠాలన్నీ పూర్తిచేసుకుని నిద్రపోవటానికి కష్టపడుతున్నాను. మనసంతా ఆమె ఆలోచనలే. కళ్లలో ఆమె నవ్విన ఆ నవ్వు ఇంకా మెదులుతూనే ఉంది. అలా నా ఆలోచనలతో తర్జనభర్జన పడి అతికష్టంమీద కళ్లు మూసుకున్నా. నా ప్రపంచమతా ఆ క్షణంలో ఒక్కరే నిండున్నట్లు ఉంది. 
కీర్తన...


(సశేషం)


Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

3 comments :