అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ - 5


 దీనికి ముందు తొలిప్రేమ - 4 ని చదవండి.

ఇక ఆ పరీక్షల సమయం ఒక్కొక్కళ్లకీ సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా ఉంది. యాంత్రిక జీవితానికి ఏదైనా ప్రత్యక్షమైన నిదర్శనం ఉందంటే అది మా బ్రతుకేనేమో అని అనిపిస్తూండేది. ఉదయాన్నే ఆరింటికి లేవడం, గంట చడువుకోవడం, (బట్టీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి)... తొమ్మిదింటికల్లా టిఫిన్ కి పరిగెత్తడం, గబగబా నోటికందినంత కుక్కుకుని పరీక్ష గదికి పరిగెత్తడం. 3 గంటలపాటు దిక్కులు చూస్తూ చివరికి ఏదోఒకటి బరికి ప్రశ్నాపత్రాన్ని మాత్రం లేత మల్లెపువ్వులాగ తెచ్చి ఫైల్లో పెట్టుకోవడం, ఇది మా రోజువారీ పనుల చిట్టా. ఇక మళ్లీ తర్వాతి పరీక్షకి కుస్తీ. ఇదీ మా తంతు. ఇది చాలదన్నట్టు మా కాలేజీవాళ్లు "మాక్ టెస్ట్"ల పేరుతో రోజుకో పరీక్ష, వెరసి రోజుకి 2 పరీక్షలు రాయడం మా వంతు. చీకటికొట్లో బందించిన ఖైదీకి ఒక్కసారిగా వెలుగు చూపిస్తే ఎంత సంతోషపడతాడో తెలీదు కానీ మేము మాత్రం ఆ పరీక్షలు అయిపోయేసరికి అంతకన్నా ఎక్కువగా ఆనందపడేవాళ్లం. ఆ తర్వాత 5 రోజులు సెలవులు. 

"అమ్మా.. పరీక్షలు అయిపోడంతో సెలవులు ఇచ్చారు. ఇంటికి ఎప్పుడు రమ్మంటావు?" అంటూ ఫోన్ చేశాను ఇంటికి.

"అమ్మో! ఇంటికా.. వద్దు నాయనా, వద్దు. ఇక్కడికి వచ్చి నువ్వు సమయం వృధా చెయ్యడంకన్నా అక్కడే ఉండి చదువుకో. ఫీజులు ఎంతెంత కడుతున్నామో తెలుసా" అంటూ సూక్తిముక్తావళి మొదలు పెట్టేసింది మా రాజ్యలక్ష్మి. గోపాల్ గాడికి కూడా ఇంటినుంచి అదే సమాధానం. "థూ.. ఎదవ బ్రతుకులు... ఎందుకురా.. " అనుకుంటూ ఇద్దరం రూముకి వచ్చేశాము. 

"గోపాల్... విక్రమ్..." అంటూ ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చి "సెలవుల్లో ఇక్కడ ఉన్న వాళ్లకి ప్రతీరోజూ సాయంత్రం స్టడీ అవర్స్ ఉంటాయట రా... వార్డెన్ ఇందాక ప్రిన్సిపాల్ తో చెబుతుంటే నా చెవిన పడింది" అని అన్నాడు.
'అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా..' అంటూ ఎస్వీ రాఘవాచార్యులు రాసిన పాట గుర్తొచ్చింది. అదేంటో కానీ నేను, గోపాల్ ఇద్దరం ఒకళ్ల ముఖంలోకి ఒకళ్లు చూసుకుంటూ ఒకేసారి అందుకున్నాం. ఒక్కసారిగా మా దౌర్భాగ్యానికి మాకే నవ్వొచ్చింది. నవ్వుకుంటూ ప్రభుతో కలిసి భోజనానికి వెళ్లాం. యే పాటు తప్పినా సాపాటు తప్పదు కదా మరి.
 
మాతోపాటు ప్రభు కూడా అక్కడే ఉండిపోతానని అన్నాడు. నాకు మాత్రం వాడి ఇంట్లో వ్యవహారం కూడా మాలాగే ఉన్నట్లు అనిపించింది. ఏదైతేనేం, మళ్లీ త్రిమూర్తుల్లాగ (నా వెర్షన్), గాంధీగారి మూడు కోతుల్లాగ (మా గోపాల్ గాడి వెర్షన్) ముగ్గురం క్యాంపస్ జీవితానికి అంకితమైపోయినట్లు ఉండిపోయాం. అంత ఏడుపులో కూడా మాకు ఓదార్పేంటంటే కేవలం సాయంత్రం మాత్రమే స్టడీ అవర్స్ ఉండేవి. దాంతో మిగతా సమయమంతా ముగ్గురం కలిసి నేను కీర్తనకి దగ్గరవ్వాలంటే ఏం చెయ్యాలో ఆలో'చించే'వాళ్లం. ఈసారి వింతేమిటంటే, మామూలుగా కరెంటులేని లౌడుస్పీకరులాగ నిశబ్దంగా ఉండే ప్రభు ఈ సారి ఒక అత్యద్భుతమైన ఐడియాతో ముంచుకొచ్చాడు. 

"ఒరేయ్, అమ్మాయిలు మంచి దేహధారుఢ్యం కలిగిన అబ్బాయిలని ఎక్కువగా ఇష్టపడతారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి నువ్వు కీర్తనని ఈ సారి కలిసినప్పుడు నీ తరహాలో ఇంప్రెస్ చెయ్యి" అంటూ గీతోపదేశం చేశాడు. 

"కీర్తనకి నేను ముందే తెలుసుకదరా... ఇంక ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా అవుతుంది?" అని నేను అడిగితే, "సెలవుల తర్వాత మొదటి సారి మీరు కలుస్తారు కదా. అదే ఫస్ట్ అనుకో" అంటూ నా ధర్మ సందేహాలని తొలగిస్తూ జ్ఞానోదయం చేశాడు.

అటుపక్క గోపాల్ కి ఇవేమీ ఎక్కట్లేదు. 5 రోజుల్లో కండలు పెంచడం ఎలాగా అని దీర్ఘాలోచనలో పడిపోయాడు. "నిజంగా పనిచేస్తుందంటావా ప్రభూ?" అంటూ అమాయకంగా అడిగిన గోపాల్ ని చూసి ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది. "అయినా నెల రోజుల్లో మాత్రలు వాడి కండలు పెంచిన వాళ్లని చూశా కాని మరీ 5 రోజుల్లో అంటే కష్టం లేరా. చెవిలో పువ్వులు పెడుతున్నావా ఏంటి?" అని నేను ఉండబట్టలేక అనేశాను. దాంతో ప్రభు కాస్త ఫీలయ్యి "రేయ్, నేనేమైనా కండలవీరుడినా, లేక నాకేమైనా జిమ్ ఉందా తెలియడానికి.. ఏదో పుస్తకాల్లోను, పత్రికల్లోను చదివిన విషయాలే కదా నేనైనా చెప్పేది." అని విసుక్కుంటూ "అయినా నాకొక పద్దతి తెలుసు. అంటే, ఎక్కడో చదివినదే అనుకోండి..." అంటూ సణిగాడు.

ఆ మాట విన్న గోపాల్ ఒక్కసారిగా పైకి లేచి నిలబడి "ప్రభు, అదేంటో చెప్పరా. నీ స్నేహితుడిగా నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను తప్పకుండా దాన్ని ఆచరించి 5 రోజుల్లో కండలు పెంచి చూపిస్తాను. ఈ నమ్మకం లేని వాళ్లు సిగ్గుతో తల దించుకునేలా చేస్తాను" అంటూ భారతంలో భీముడి స్టైల్లో ప్రతిజ్ఞ చేసి "ఇంక ఓడిపోవడం నీ వంతు" అన్నట్లు నా వైపుకు చూశాడు. ఇంతకీ పద్ధతేంటంటే మొదటి రోజు తాజా కూరగాయలు (బంగాళాదుంప తప్ప) తినాలి. రెండవ రోజు తాజా పళ్లు, మూడవ రోజు కాసిని పళ్లు కూరగాయలు కలిపి, నాలుగవ రోజు ఉడకబెట్టిన బంగాళాదుంపతో గుప్పెడు అన్నం, అయిదవ రోజు గుప్పెడన్నం, సాలాడ్స్. "ఇంతకీ ఇవన్నీ తిండికి ముందు తినాలా, తర్వాత తినాలా" అంటూ మళ్లీ మా గోపాల్ తనదైన శైలిలో అడిగేసరికి "నాన్నా, నేను చెప్పినదే తిండి. ఇంకేమీ తినకూడదు." అన్నాడు ప్రభు.

"రేయ్, నన్ను చంపడానికెమైనా కుట్ర పన్నుతున్నావా ఏంటి? ఏదైతేనేం.
"అది సరే కాని, విక్రమ్, ఎప్పుడు మొదలుపెడదాం మనం?" అంటూ నా వైపుకు తిరిగాడు గోపాల్. 

"నన్నొదిలెయ్యరా బాబూ.. ఈ వింత తిండి, ఈ గోల నాకొద్దు. నువ్వేదో సాధించేద్దామనుకుంటున్నావు కదా. -ధించు." అంటూ వాళ్ల పిచ్చి నుండి విడుదల కోసం పోరాడి అక్కడినుంచి తప్పుకున్నా. ఇంక మొదలైంది మా గోపాల్ విన్యాసలీల. మొదటి రెండు రోజులు బానే గడిచినట్లు అనిపించింది మాకు. మూడో రోజు జాగింగ్ కోసం వెళ్లిన గోపాల్ తిరిగి రాలేదు. ఏమయ్యిందో అని నేను, ప్రభు వెతుక్కుంటూ వెళ్లాం. మా హాస్టల్ ముందున్న జాగర్స్ పార్క్ కి వెళ్లేవాడు కాబట్టి వాణ్ని వెతుకుతూ మేము అక్కడికి చేరాము. అక్కడ ఒక మూలకి బస్కీలు తియ్యడానికి అనుగుణంగా కడ్డీ ఒకటి ఉంది. ఆ కడ్డీ మీద తుఫాను తాకిడికి చెట్టుకు వేళాడే కళేబరంలాగ వేళాడుతూ ఉంది వాడి శరీరం. అది శవమా జీవచ్ఛవమా అన్నది కనిపెట్టడానికి మాకు పది నిముషాలు పట్టింది. ఇంతలో ప్రభుకు ముచ్చెమటలు పట్టాయి. ఇదంతా చూసి తిక్కమీదున్న నేను చేతులు రుద్దుకుని లాగి ఒక్కటి వాడి చెంప మీద కొట్టాను. ఆ దెబ్బకి పూనకమొచ్చినవాడిలాగ వీరంగమెత్తుతూ "రేయ్... ఎవడ్రా నన్ను కొట్టినది... నీ... రేయ్... ఏంట్రా... నిన్ను చ....ం...ప్..ఏ...స్త్....ఆ............" అంటూ మళ్లీ కిందకి పడిపోయాడు.

ఇద్దరం కలిసి కష్టపడి వాణ్ని డాక్టరు దగ్గరికి మోసుకెళ్లాం. వాడి పరిస్థితి చూసిన డాక్టరుకి మూర్ఛొచ్చినంత పనయ్యింది. చివరికి 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, కడుపునిండా మూడు పూట్లా భోజనం చేసి కాస్త అడపాదడపా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగితే త్వరగా కోలుకుంటాడని ఆయన అన్నారు. దాంతో కాస్త నా మనసు కుదుటపడింది. ఇక మా ప్రభు అయితే ఆసుపత్రిలోనే దేవుడికి పొర్లు దండాలు పెట్టేశాడు. చివరకి తెలిసిందేంటంటే గోపాల్ కూడా కీర్తన స్నేహితురాలైన గీతని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తనని పడేయటానికి ఇంత కష్టపడ్డాడని తెలిసింది. 

"ఛ... గీత సానుభూతి కొట్టేశాడు కదా వెధవ..." అని అనుకుంటూ నేనే గనుక అదే పరిస్థితిలో ఉండుంటే, కీర్తన ఏం చేసేదా అని ఆలోచిస్తూ కాసేపు అలా ఊహాలోకంలోకి వెళ్లిపోయాను. ఇంతలో గోపాల్ ఉన్న ఆసుపత్రి గదిలోకి వెళ్లిన మేము, వాణ్ని చూసి విరగబడి నవ్వడం మొదలుపెట్టాము. అది చూసి అర్థంకాక ఏమయ్యిందని అడిగిన గోపాల్ ని చూసి, నేను "ప్రభు, అదేంటో చెప్పరా. నీ స్నేహితుడిగా నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను తప్పకుండా దాన్ని ఆచరించి 5 రోజుల్లో కండలు పెంచి చూపిస్తాను. ఈ నమ్మకం లేని వాళ్లు సిగ్గుతో తల దించుకునేలా చేస్తాను" అంటూ భారతంలో భీముడి స్టైల్లో ప్రతిజ్ఞ చేసి "ఇంక ఓడిపోవడం నీ వంతు" అన్నట్లు వాడివైపు చూశాను.

ఇంక ఏం చెయ్యాలో తెలియక 'సిగ్గుతో కూడిన వినయ గౌరవ మొహమాటం'తో నా వైపు, క్రోధాగ్నితో రక్తసిక్తమైన కళ్లతో ప్రభు ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు గోపాల్.

(సశేషం )

Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

0 comments :

కామెంట్‌ను పోస్ట్ చేయండి