అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ - 6

దీనికి ముందు తొలిప్రేమ-5 ని చదవండి


ఆ నవ్వుల లోకంలోనుండి బయటికొచ్చిన మాకు ఆ మరుసటి రోజు పెద్దషాకే తగిలింది. సెలవులు ముగిసిపోవడంతో అందరూ కాలేజీకి తిరిగొచ్చేశారు. ఇక ఒక్కో పరీక్షవీ మార్కులు ఇవ్వడం మొదలుపెట్టారు. హిందీ తప్ప మిగతా అన్ని పరీక్షల్లోను నాకు మార్కులు బాగానే వచ్చాయి. కీర్తన కూడా హిందీలో అతి కష్టంమీద ఈది త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడింది. మా కళాశాలలో పరీక్షలు తప్పినవాళ్లకి, త్రుటిలో తప్పించుకున్నవాళ్లకి, ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించడం అలవాటు. క్లాస్ లీడర్ ని కావడంతో అలాంటి విద్యార్థుల చిట్టా మొత్తం నేనే సేకరించి మా హిందీ టీచరుకి ఇవ్వవలసి వచ్చింది. ఇంక మా ప్రభు రంగంలోకి దిగాడు. "ఒరేయ్ విక్రమ్. నా దగ్గర ఓ ఇడియా ఉంది." అన్నాడు.
గత అనుభవాలన్నీ కూడగట్టుకున్న తర్వాత వాడిమీద నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదని నిర్ణయించుకుని వాడి మాటలు పెడచెవిన పెట్టబోయాను. అంతలో మనవాడు కాస్త "టచ్ చేసావ్ బాస్.. టచ్ లో ఉండు" టైపులో డైలాగు వదిలేసరికీ ఇంక ఏమీ చెయ్యలేక వీడి బాధేంటో కనీసం వింటే సరిపోతుంది కదా అని "సరే.. ఏంటో చెప్పరా" అని అన్నాను.
"నీకు మార్కులు బాగానే వచ్చినాసరే ఏదో ఒక కారణం వెతికి నువ్వు కూడా కీర్తనతో ఆ క్లాసులో చేరిపో.. ఇంక ఆ తర్వాత నేను చెప్పేదేముంది? అవకాశాన్నిబట్టి నువ్వే ఏం చెయ్యాలో నిర్ణయించుకో.." అని అన్నాడు.
ఆ రోజు మా హిందీ టీచరుని కలవటానికి వెళ్లినప్పుడు "మేడమ్, మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీ స్పెషల్ క్లాసుకి రావచ్చా?" అని అడిగాను. "ఏంటి విక్రమ్? ఇప్పటిదాకా క్లాసులు ఎగ్గొట్టడానికి కారణాలు చెప్పేవాళ్లని చూశానుకాని క్లాసుకి అవసరం లేకపోయినా వస్తానంటున్నవాడిని నిన్నే చూస్తున్నా. ఏంటి సంగతి?" అంటూ ఆవిడ ఆశ్చర్యంతో చూస్తూ అడిగింది. "ఏమీ లేదు మేడమ్.. నేను ఆ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అన్నింటికీ ఏదో గుడ్డిగా టిక్కులు పెట్టేశాను. అవి కాస్తా తప్పులు కాకుండా పోయాయి. నిజానికి నేను పాసయ్యేవాడిని కూడా కాదేమో. అందుకే..." "ఆహా.. నీ అంత ఉత్తమ విద్యార్థి ని ఇప్పటివరకూ నా పది సంవత్సరాల అధ్యాపక జీవితంలో చూడనేలేదు. ఇలాగే నువ్వు చదువు పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటే జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగిపోతావు." అంటూ నన్ను మెచ్చుకుని ఆ తదుపరి రోజునుండి తన స్పెషల్ క్లాసులో కూర్చోవడానికి అనుమతించింది.
ఆ తదుపరిరోజు మా క్లాసులో "అందరూ విక్రమ్ ని చూసి నేర్చుకోండి. తనకున్న నిజాయితీ, పట్టుదలలో పదోవంతు మీకున్నా సరే మీకందరికీ ఎంతో మంచి మార్కులు వస్తాయి." అని తేల్చి చెప్పేసింది. అది చూసిన గోపాల్ క్లాసయ్యిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్లి తను కూడా (గీత కోసం) స్పెషల్ క్లాసులో చేరతానని అన్నాడు. అప్పటికే ఎవరితోనో గొడవపడి ఉన్న ఆవిడ నవ్వుతూ ఉన్న మా గోపాల్ గాడి మొహం చూసి వీడేదో సరదాకి అంటున్నాడనుకుని వాణ్ణి చెడామడా తిట్టేసి పంపించేసింది. గుడ్డిగా సమాధానాలు రాయడం గొప్పేమీ కాదని, ఒళ్లు దగ్గరపెట్టుకుని చదవకపోతే ఈ సారి గట్టిగా మందలించవలసి ఉంటుందని తిట్టేసింది.
ఆ మరుసటి రోజు స్పెషల్ క్లాసెస్ మొదలయ్యాయి. విషయమేమిటంటే అన్ని తిట్లు తిన్న గోపాల్ కూడా క్లాసుకు వచ్చాడు. ఇంకేముంది, నేను ఎంతో ఆనందంతో వెళ్లి తన వెనుకే ఖాళీగా ఉన్న చోట గోపాల్ ని కూర్చోపెట్టాను. వాడి వెనుక నేను కూర్చున్నా, ఆమెను తొంగిచూడటానికి వాణ్ణి అడ్డంగా పెట్టుకుని పండగ చేసుకున్నా. తనకి అనుమానం రాకుండా ఉండేందుకు మధ్యమధ్యలో వాడివెనుక దాక్కుంటూ, నక్కి నక్కి మొత్తానికైతే కనీసం ఒక యాభైసార్లు చూసుంటా. ఇంత జరుగుతున్నా తను కనీసం నన్ను పట్టించుకోట్లేదే అన్న బాధ. ఇంతలో క్లాసయిపోయినతర్వాత గోపాల్ వచ్చి "విక్రమ్, ఇవాళ తను నీ వైపు మూడు సార్లు చూసింది రా..." అని అన్నాడు. నన్ను ఓదార్చటానికి వీడే అలా అన్నాడో, లేక నిజంగానే తను నావైపు చూసిందో తెలీదుకానీ నా మనసు మాత్రం ఆకాశంలో తేలియాడుతోంది.
అలా రోజూ క్లాసంతా నేను తనని చూడటం, తర్వాత గోపాల్ వచ్చి తను నన్ను ఎన్ని సార్లు చూసిందో చెప్పటం, దానిమీద ఓ గంట సోది కొట్టుకోవటం, ఇదే రోజూ మా తంతు. ఎంత ప్రయత్నించినా తనతో మాట్లాడాలంటే భయం. దానికితోడు అవకాశాలు కూడా కరువు. అలా ఉండగా, ఒకరోజు ఆ అవకాశం రానే వచ్చింది. ఒకరోజు పరీక్ష నిర్వహించిన మా మేడమ్ మా జవాబుపత్రాలని ఒకళ్లవి ఇంకొకళ్లు దిద్దుకోమన్నారు. ఆ రోజు గీత రానందుకు కీర్తన ఒంటరిగా కూర్చుని ఉంది. అది చూసిన నేను తన పక్కకి వెళ్లి నా జవాబుపత్రాన్ని దిద్దమని అడిగాను. కాదనలేక ఒప్పుకుని, తన జవాబుపత్రాన్ని నాకు ఇచ్చింది. చూస్తే తన పేపర్ మొత్తం ఖాళీగా ఉంది. ఇంకోపక్క మా హిందీ మేడమ్ చూస్తే మార్కులు తక్కువ వచ్చిన వాళ్లని భారీగా శిక్షిస్తానని కూడా అంది. దాంతో ఏమీ రాయని తన పేపర్ మీద నా పేరు రాసి నా పేపర్ మీద తన పేరు రాసి మాట్లాడకుండా మేడమ్ కి ఇచ్చేసి వచ్చాను. తరువాతి రోజు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ల పేర్లన్నీ చదువుతూ చివరకి నా పేరు చదివింది మా మేడమ్. తన పేరు రాకపోవడంతో ఆశ్చర్యపోయిన కీర్తన నిజం తెలుసుకుంది. మా మేడమ్ నన్ను పిలిచి "ఏంటి విక్రమ్, ఏమైంది నీకు? ఎంతో మంచి విద్యార్థివనుకున్నాను నిన్ను, నీ నిబద్ధతని చూసి. అసలు పేపర్లో ఏమీ రాయకుండా ఇచ్చేస్తే అర్థం ఏంటి?" అని అడిగింది.
"మేడమ్.. అదీ... ఊ... అంటే... గుడ్డిగా సమాధానాలు పెట్టడం ఇష్టం లేక..."
"చాలు విక్రమ్.. నేనింక నీ సోది వినదలుచుకోలేదు. నువ్వు కనీసం చదవట్లేదు. ఏమాత్రం చదివినా సరే నువ్వు ఇలా ఖాళీగా పేపర్ ఇచ్చేవాడివి కాదు" అంటూ నన్ను మందలించింది. అది చూసిన కీర్తన నవ్వాపుకోలేక అవస్థపడుతూ ఉంటే, తన ముసిముసినవ్వును చూసి నాకు ముచ్చటేసింది. "పడిందిరా పిల్ల" అని మనసులో అనుకుంటూ మా మేడమ్ చెప్పిందంతా చందమామ కథలా వినేశాను. మరోపక్క తను నాతో దీనిగురించి ఎప్పుడు మాట్లాడుతుందా అని అనుకుంటూ అలా ఉండిపోయాను.


(సశేషం)
Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

2 comments :