అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ - 7

దీనికి ముందు తొలిప్రేమ - 6 ని చదవండి.
కొన్ని రోజులు గడిచాయి. నేను రోజురోజుకీ ఎంతో ఉత్సాహంతో క్లాసుకి వెళ్తున్నాను. కాకపోతే చదువు మీద శ్రద్దతో మాత్రం కాదు. ఎవరో ఓ మహానుభావుడు  చెప్పినట్లు, ప్రేమలో ఉంటే ఇంక ప్రపంచమేదీ కనిపించదు అని, చుట్టూ మనం ప్రేమించినవాళ్లే కనిపిస్తారని, నాకు కూడా అచ్చం అలాగే ఉంది. ఎటు చూసినా ఆమె రూపమే. ఎవ్వరేమన్నా, ఆమె మాటలే, ఆ నవ్వుల సవ్వడే. దీని ప్రభావం కాబోలు, ఆఖరికి ప్రభు చెప్పే సోది కూడా ఎంతో తీయగా అనిపించేది. చివరికి క్లాసుల్లో కూడా ఏం చెబుతున్నారో వినిపించేదే కాదు. పైగా తను నవ్వినప్పటినుంచి తనకి నా పట్ల ఎటువంటి దురభిప్రాయమూ లేదని తేలిపోయింది. ఇంకా రోజురోజుకీ నాకు తనంటే ఇష్టం పెరిగింది.
దాంతో ఓ రోజు మా గదిలో మళ్లీ ఉప్పర మీటింగు మొదలయ్యింది. "ఇంకేముందిరా, విషయం తేలిపోయింది. కాబట్టి, వెళ్లి నీ మనసులో మాట చెప్పెయ్యి." అని మా గోపాల్ అంటే, "వద్దురా. తొందర పడకు. ఇంకొన్ని రోజులు ఆగు. తన మనసులో నిజానికి ఏముందో తెలుసుకున్నాకే నీ మనసులో మాట చెప్పు" అని మా ప్రభు అన్నాడు. "అమ్మాయిల విషయంలో ఎప్పుడూ అనుకోనివే జరుగుతాయటరా. నేనెక్కడో చదివాను." అని అన్నాడు. కబీరు తెలిసి అన్నాడో, తెలియక అన్నాడో తెలీదు కాని, అతి కష్టమైన సముద్రం లోతుల్ని కొలవచ్చు, ఆకాశం ఎత్తుని కూడా కొలవచ్చు, కానీ ఆడదాని ఆలోచనలను అంచనా వెయ్యటం చాలా కష్టతరం అని, నిజం కాకపోతే ఎందుకు అంటాడు, అని మనసులో అనుకుంటూ, ప్రభు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందని గ్రహించి వెంటనే తనకి నా ప్రేమని చెప్పడం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను. 
ఆ మరుసటి రోజు నేను కొంచెం ముందుగానే క్లాసుకు వెళ్లి గోపాల్ కూర్చునే చోట కూర్చున్నాను. సాధారణంగా వాడు మధ్య వరుసలోని చివరి బెంచీలో కుడిచేతి పక్కకి కూర్చుంటాడు. తన పక్కనే పక్క వరుసలో ఎడమ పక్కకి కూర్చుంటుంది గీత. ఆ రోజు నేను గోపాల్ జాగాలో కూర్చోవడం చూసిన గీత వెళ్లి కీర్తన బెంచీలో కూర్చుంది. తర్వాత వచ్చిన గోపాల్ నన్ను చూసి తిట్టుకుంటూ నా పక్కన (నేను ఎప్పుడూ కూర్చునే చోటు) కూర్చున్నాడు. ఆ తర్వాత వచ్చిన కీర్తన ఏమీ చెయ్యలేక వచ్చి గీత కూర్చునే చోట (నా పక్కకి) కూర్చుంది. 
ఆ రోజు యాద్ధృచ్చికంగా జరిగిందో, లేక ఇదంతా ముందే రాసుందో కానీ, నా పెన్ను రాయటం ఆగిపోయింది. ఎవరినడగాలో తెలీక అటూ ఇటూ చూస్తున్న నాకు పక్కనుండి ఒక చెయ్యి కనిపించింది. "ఇదిగో, కావాలంటే ఇది తీసుకో" అంటూ కీర్తన తన దగ్గరున్న పెన్ను ఒకటి ఇచ్చింది. మనసులో మురిసిపోతూ నేను పెన్నును తీసుకున్నాను. ఇంక దాన్ని పైకీ కిందకీ చూస్తూ నా ఊహల్లో మునిగితేలుతున్నాను. "ఒరేయ్, అది నేను నీకు గత నెల ఇచ్చిన పెన్నే కదరా... ఎక్కడో పోయిందని కూడా చెప్పావు..??" అంటూ ఒక గార్ధభస్వరం వినిపించింది. "కట కట కట కటా...." అని అనుకుంటూ పక్కనున్న గోపాల్ వైపు చూసేలోపే అ పక్కనుండి కీర్తన చూసి ఫక్కున నవ్వేసింది. 
కొన్ని వారాలు గడిచాయి. మేము అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లము. ఎటొచ్చీ ఎప్పుడు తనతో నా ప్రేమ విషయం మాట్లాడాలన్నా గొంతు ఎండిపోయినట్లు, నాలుక మెలిక పడినట్లు అనిపించేది నాకు. ఇక అలా అయ్యిన ప్రతిసారీ సాయంత్రం మా ఉప్పర మీటింగు జరిగేది. తనకి విషయం చెప్పాలని గోపాల్, ఇంకా ఆగి తనని అర్థం చేసుకున్నాకా గానీ చెప్పకూడదని ప్రభు, రోజు మేము వాదించుకోవడమే. ఎటొచ్చీ తనక్కూడా నేనంటే ఇష్టం ఉన్నట్టు ఎందుకో నాకు అనిపించేది. పెద్ద చర్చ జరిగాక మొత్తానికి హిందీ స్పెషల్ క్లాసు తర్వాత వెళ్లి మాట్లాడమని చెప్పాడు ప్రభు. 
"ఏం చెప్పావు రా!" అన్నాడు గోపాల్. 
"ఏం లేదు రా, ఒకవేళ తను లాగి చెంప పగులగొట్టిందనుకో, ఎవ్వరూ చూడకూడదు కదా ఎందుకైనా మంచిదని ఆ చోటు చెప్పాను రా…" అని నెమ్మదిగా ఊదాడు ప్రభు. 
"ఆపరా అపర చాణక్యా! నీ తెలివికి జోహార్లు. నువ్వేం చెప్తే అదే చేస్తా లే రా.. నువ్వు..." 
"గోపాల్... రేపు గీతతో మాట్లాడు. క్లాసు అయిపోయిన తర్వాత కీర్తనని బయటికి వెళ్లనియ్యకుండా అక్కడే ఉండేలా చూడమను. మన హీరో వెళ్లి అప్పుడు మాట్లాడుతాడు.అని జేమ్స్ బాండ్ లాగ ప్లాన్ వివరించి బయటికి వెళ్లిపోయాడు ప్రభు. 
ఆ మరుసటి రోజు గీతకి మా ప్లాన్ అంతా వివరంగా చెప్పాము. తను మాతో సహకరించడానికి అంగీకరించింది. ఇక ఆ రోజు హిందీ స్పెషల్ క్లాసు అయిపోగానే ఏదో పని ఉన్నట్టు కీర్తనని ఉండమని చెప్పింది. సమయం చూసుకుని నన్ను కీర్తనను ఒంటరిగా వదిలి తను సన్నగా జారుకుంది. 
"కీర్తనా.. నీతో ఎప్పటినుంచో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను." 
"ఆ.. చెప్పు విక్రమ్." "ఎలా చెప్పాలో తెలియడం లేదు. తిన్నగా చెప్పేస్తున్నా. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు ఎందుకో ఇష్టం కలిగింది. ఐ థింక్ ఐ లవ్ యూ.. నేను చాలా సార్లు ఆలోచించాను. ఇది నిజమా కాదా అని. ప్రతిక్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇక ఎన్నో రోజుల తర్వాత ఇప్పుడు ఈ విషయం...." 
నేను పూర్తిగా ముగించేలోపే కీర్తన అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేనింక అక్కడే దిక్కులు చూస్తూ వెర్రి మొహం వేసుకుని నిలబడిపోయా. అమ్మాయిల విషయం లో మాత్రం ఎప్పుడూ మనం అనుకున్న విధంగా ఏదీ జరగదు అని మా ప్రభు ఎప్పుడూ అనే మాట మొదటిసారి నాకు నిజమని అనిపించింది. 
ఆ తరువాత ఓ నాలుగు రోజులపాటు అసలు మా మధ్య మాటలే లేవు. ఎదురుపడినా సరే ఏదో చూడనట్లు వెళ్లిపోయేది. నేను మాత్రం ఏమీ చెయ్యలేక, నా జాతకాన్ని తిట్టుకుంటూ ఉండిపోయా. అలా కొన్ని రోజుల తర్వాత నేను నా క్లాసు నుంచి బయటికి వస్తుంటే వెనక నుండి ఒక తియ్యటి పిలుపు, "విక్రమ్" అని.. వెనక్కి తిరిగి చూస్తే కీర్తన, గీత తో పాటూ నిలబడి ఉంది. 
"విక్రమ్, నువ్వు నాకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి ఏమీ ఆలోచించకు. అయినా నీకు నా గురించి కొంచెం కూడా తెలియదు. కాబట్టి దయచేసి ఇలాంటి ఆశలు ఏవీ పెట్టుకోకు. ఇదివరకటి లాగే మనం మంచి స్నేహితులలాగే ఉందాము. నా వెనుక తిరిగి విలువైన నీ టైం వృధా చేసుకోకు." అని చెప్పి వెళ్లిపోయింది. 
ఇంక ఆ రాత్రి మా త్రిమూర్తుల తొక్కలో చర్చ మళ్లీ మొదలయ్యింది. 
"రేయ్, నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా... ఏ అమ్మాయైనా తనకి మొదటి సారి ప్రపోజ్ చేసినప్పుడు ఇలాగే అంటుంది. అది ఒక పరీక్ష రా. నువ్వు ఎంత పట్టుదలతో తనని వదలకుండా ఉంటే అంతగా నీ ప్రేమలో పడుతుంది. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు..." అన్నాడు గోపాల్. 
మా PPP (పనికిమాలిన ప్రొఫెసర్ ప్రభు) మాత్రం ఏమీ పట్టనట్లు ఒక మిలిటరీ మేజర్ లాగ చేతులు కట్టుకుని గుడ్లు మిటకరించి చూస్తూ మధ్యలో నిలబడి "రేయ్, అమ్మాయిలు ఎప్పుడూ వాళ్లని మహరాణుల్లాగ చూసుకునే అబ్బాయిలంటే పడి చస్తారు. సో, సో, నువ్వు తనని అలా ఫీలవుతున్నట్లు తను ఫీలయ్యేట్టు చెయ్యగలవా?" అని మొదలు పెట్టి మళ్లీ ఓ పెద్ద చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు ప్రభు.
"ఈ ఎదవ వయసుకీ, మాట్లాడే మాటలకీ ఎమైనా సంబంధం ఉందా అసలు?" అని అనుకుంటూ వాడి కథ వింటూ కళ్లు మూసుకుని అలాగే నిద్రలోకి జారుకున్నా. 

(సశేషం)

Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

6 comments :

  1. ఉదయ్ శంకర్ గారు, మీది పశ్చిమ గోదావరా? ఎందుకంటే ఆ జిల్లాలో యర్రమిల్లివారిని చాలా మందిని చూశాను.

    రిప్లయితొలగించండి
  2. కాదు.. తూర్పు గోదావరి. ఒంటిమామిడి అని, కాకినాడ దగ్గర, మా పూర్వీకుల ఊరు.. ప్రస్తుతానికి కాకినాడ మా సొంత ఊరు.

    రిప్లయితొలగించండి
  3. blogger lo maamoolugane create cheyyochu. kakapothe manaki kavalasinavi telugu lo type chesi paste cheyyali..

    telugu lo type cheyyataniki nenu
    www.telugutyping.com ane website ni use chestanu..

    రిప్లయితొలగించండి