“నాన్నా, వాడు చాలా పూర్ నాన్నా. వాణ్ణి ఆ బంటీ గాడు ఎక్కిరిస్తుంటే చూసి కోపమొచ్చి కొట్టా. ఆది చూసి మా టీచర్ ఒరేయ్, నీకు దూకుడు బాగా ఎక్కువ రా అని అంది. ఆసలు దూకుడంటే ఏంటి నాన్నా? గుడ్డా బ్యాడా?” అని ఓ కొడుకు తన తండ్రిని అమాయకంగా అడుగుతాడు.
“గుడ్డే రా” అంటాడు ఆ తండ్రి.
ఇది దూకుడు సినిమాలో హీరో మాట్లాడే తొలి సన్నివేశం. ఆ తర్వాత ఆ తండ్రి ప్రమాదంలో మరణిస్తాడు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు, అదే దూకుడుతో. ఎంతంటే దేన్నీ లెక్క చేయని పోలీస్ అవుతాడు.
మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోను సూద్ ముఖ్య తారాగణం గా, శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన దూకుడు చిత్రం ఈ నెల 23న ప్రపంచమంతా భారీ ఎత్తున విడుదలయింది. ఐదేళ్ళుగా తమ అభిమాన నటుడి నుండి ఓ మంచి చిత్రం కోసం ఎదురుచూసిన రాజకుమారుడి అభిమానుల అంచనాలను మించి వారికి కన్నుల పండుగగా, దసరా పండుగ కానుకగా తెరమీదికొచ్చింది ఈ చిత్రం. తన మిగతా చిత్రాలకుమల్లే ఇందులో కూడా హాస్యానికి పెద్దపీట వేస్తూ ప్రముఖ హాస్యనటులందరి పాత్రలను ఎంతో అద్భుతంగా సృష్టించాడు శ్రీను వైట్ల.
సినిమా హీరో అవ్వాలనుకుని అవ్వలేక వయసైపోయినవాడి పాత్ర ఎం.ఎస్.నారాయణ పోషించారు. సొంతం సినిమాలో రీలు లేని కెమెరాతో ఫొటో షూట్ చేసే బుర్రలేని ఎం.ఎస్. ఇందులో మాత్రం హై డెఫినిషన్ కెమెరాతో వీడియో షూట్ చేసి పెట్టుకుంటాడు. యమదొంగ, మగధీర, సింహా, రోబో చిత్రాలలో కీలక సన్నివేశాలను అనుకరిస్తూ చేసిన ఆ వీడియో షూట్ చూస్తే నవ్వలేక పిచ్చెక్కుతుంది. “కళ్ల కింద కారీ బ్యాగ్ పెట్టుకుని, నువ్వు హీరో అంటే ఎలా నమ్మావ్ రా” అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే “గ్రాఫిక్స్ లో తీసేస్తారనుకున్నా” అని చెప్పే సన్నివేశంలో ఎమ్.ఎస్. భేష్.
దీనికి తోడు నెగిటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్ చేయ్యాలని తపనతో కాలి బూడిదైపోతున్న తింగరోడి పాత్రను బ్రహ్మానందం పోషించారు. వీళ్ళిద్దరినీ ఒక రియాల్టీ షో పేరుతో ఆడుకునే మన హీరో, ఈ సన్నివేశాలతో సినిమా సెకండ్ హాఫ్ అంతా నవ్వుకోడానికే సరిపోతుంది. “నాకు ఐస్ క్రీం అన్న క్రైం అన్నా ఒకటే రా. పెద్ద తేడా లేడు. ఐస్ క్రీం తింటే కనీసం పుల్లైనా మిగులుతుంది. నేను క్రైం చేస్తే ఏమీ మిగలదు.” ఆని ఇంట్రో సీన్ లో డైలాగు చెప్పినప్పుడు, “నన్ను వాడుకోండి సార్.” అని మహేష్ తో అంటున్నప్పుడు, బ్రమ్మి తనదైన శైలిలో ప్రేక్షకులని మైమరిపించేశాడు. ఒక సన్నివేశంలో వెంటవెంటనే రౌద్రం, అమాయకత్వం, ఆనందం, ఇలా ఏడెనిమిది రకాల ఎక్స్ప్రెషన్స్ చూపించి తనకు తనే సాటి అని అనిపించుకున్నాడు. పెన్ కెమెరాలో నాగార్జునతో మాట్లాడడం, SMS అప్పీల్ చెయ్యడం లాంటి సన్నివేశాలు మనల్ని నవ్వాపుకోనీయకుండా చేస్తాయి. బ్రహ్మానందం అభిమానులకి ఈ చిత్రం ఓ కన్నుల పండుగ.
కాస్త సన్నబడిన సమంతా, అందాన్ని అభినయాన్ని తెరమీద చక్కగా పలికించింది. తన పాత్ర, వ్యవధిలో చిన్నదే అయినా మనకు గుర్తుండే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి పాటలలో హీరో పక్కన ఎంతో అద్భుతంగా కనిపించింది. ఈక “పూవై పూవై” పాటలో ఉర్రూతలూగించింది పార్వతి మెల్టన్. ప్రకాష్ రాజ్, శియాజీ షిండే, సుప్రీత్, కోట శ్రీనివాస రావు, సోను సూద్, ఎవరెవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. చెప్పుకోదగ్గ విషయమేమిటంటే నాజర్ ఇందులో ఒక హాస్యభరితమైన పోలీసు పాత్రను పోషించారు.
ఇక మాటలు. ప్రాసని, యాసని ఒద్దికగా కలబోసి ఎంతో ప్రయాసతో మాటలు రచించారు శ్రీను వైట్ల, కోన వెంకట్. థమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే అదుర్స్ అనిపించాయి. నేపధ్య సంగీతం కూడా చాల చక్కగా సన్నివేశానికి అనుగుణంగా రూపొందించాడు థమన్. నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గకుండా ఖర్చుకి వెనకాడకుండా చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అన్నింటినీ మించి శ్రీను వైట్ల దర్శకత్వం. ఈ చిత్రంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బాక్సాఫీసుని షేక్ చెయ్యగల సత్తా ఉన్న దర్శకులలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు.
ఇంక మిగిలింది మహేష్. తను ఒక దర్శకుడి హీరో అని మళ్ళీ ఋజువు చేసాడు ఈ చిత్రంతో. యాక్షన్ సీన్లలో రౌద్రం, హాస్య సన్నివేశాలలో ఎం.ఎస్, బ్రమ్మి ల పక్కన చిన్నతనం, రెండూ ఎంతో అలవోకగా పండించాడు. హాస్య సన్నివేశాలలో తను కూడా హీరోయిజాన్ని పక్కన పెట్టి ఓ హాస్య నటుడిగా ఎంతో ఒదిగిపోయాడు. శ్రీను వైట్ల కి ఉన్న కామెడీ టైమింగుని మహేష్ మంచినీటిప్రాయంగా జీవించాడు. ఓక పక్క ముఖం మీద చిరునవ్వును, ఆశ్చర్యాన్ని ఒకేసారి చూపిస్తూ పొట్టి పొట్టి పంచ్ డైలాగులతో దుమ్మురేపి, మరోపక్క విలన్ ని ఎదుర్కొనే సన్నివేశాలలో తెలంగాణా యాసతో చించేశాడు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో, సెకండ్ హాఫ్ లో ఎమ్.ఎస్, బ్రమ్మి లతో, హాస్యరసాన్ని అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మానందం లను పొగడ్తలతో ఎత్తేసే సన్నివేశాల్లో మహేష్ లోని అసలైన కామెడీ కోణాన్ని చూడొచ్చు.
మొత్తంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మొదటినుండీ తెలుగు పరిశ్రమ తమిళ డబ్బింగ్ చిత్రాలనే పోషించింది. ఒక చక్కని సంపూర్ణమైన తెలుగు చిత్రం కోసం వేచిచూసిన ప్రేక్షకులకి దసరా కానుకగా ఈ చిత్రం సరైన సమయంలో ముందుకొచ్చింది. ఇప్పటికే రికార్డులను సృష్టిస్తున్న ఈ చిత్రం ‘మగధీర’ రికార్డులను తిరగరాస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. అంతవరకూ ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు ఈ సినిమా చూసి ఆనందించడమే మన పని.
చివరిగా సినిమాలోని కొన్ని పంచ్ డైలాగులు
మైండ్ లో ఫిక్స్ ఐతే బ్లైండ్ గా ఎళ్ళిపోతా.
భయానికి మీనింగే తెలియని బ్లడ్డు రా నాది.
ఓక్కొక్కడి బల్బులు పగిలిపోవాలి
కళ్లున్నోడు ముందే చూస్తాడు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. (తెలంగాణా యాసలో)
ఈ దూకుడే లేకపోతే పోలీస్ మాన్ కి, పోస్ట్ మాన్ కి తేడా ఏముంటుంది?
నేను నరకడం మొదలుపెడితే నరకం బయట హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవలసిందే రా.
నేను రిలీజ్ ఐన బుల్లెట్ లాంటివాడిని. లెఫ్టు రైటు ఉండవు. స్ట్రైటుగా వెళ్లిపోతా.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి