అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

తొలిప్రేమ - 8


ధభేల్ మంటూ ఒక శబ్దం. మొహం మీద ఏదో పడినట్లు అనిపిస్తోంది. ఉలిక్కిపడి లేచాను నేను.

"రేయ్ వెధవన్నర వెధవా…  నీకోసం మేమిద్దరం ఇక్కడ ప్లానులు వేయలేక చస్తుంటే నీకు నిద్ర ఎలా పడుతోంది రా???" చేతిలో దిండు పట్టుకుని రెచ్చిపోతూ అన్నాడు ప్రభు.

ఏమీ లేదు రా. మన గోపాల్ గీతకి ఎలా ప్రపోజ్ చేసాడా అని ఆలోచిస్తూ ఉన్నా. తన పుట్టినరోజు నాడు రోజాపూలు తీసుకెళ్లి మోకాళ్ల మీద కూర్చుని... హ హ హ... అసలు.."

"రేయ్... కోసింది చాలు కాని, ముందు నీ గురించి... అవును ఏమన్నావ్? పుట్టిన రోజు... రేయ్, కీర్తన పుట్టిన రోజు ఇంకో వారంలో ఉంది రా. నువ్వు ఆ రోజు ఏదైనా స్పెషల్ గా చెయ్యి రా తనకోసం. పడకపోతే అప్పుడు నన్నడుగు" అని అన్నాడు గోపాల్.

నెత్తి మీద ఆపిల్ పడ్డ న్యూటన్ లాగ ఆలోచనలో పడిన నేను చివరకు వాడు చెప్పిన సలహా సమంజసంగానే ఉందని ఫిక్స్ అయిపోయా.

"కాకపోతే ఒక చిన్న సమస్య రా. తన పుట్టిన రోజు నాడు కీర్తన తన ఇంటికి వెళ్తోందట రా. మరి నువ్వు ఎలా కలుస్తావు?" అన్నాడు ప్రభు.

"రేయ్, ఆలోచించకూడదు రా. ఇదే మంచి అవకాశం. తన ఊళ్ళోనే కలుస్తా. తనని థ్రిల్ చేస్తా. ప్రపోజ్ చేసి పిచ్చెక్కిస్తా. ఎందుకు వర్కవుట్ అవ్వదో చూద్దాం." అంటూ అక్కడినుంచి వెళ్లిపోయా.
ఏం చేసైనా సరే, కీర్తనని మాత్రం తన పుట్టినరోజు నాడు కలవాలన్న ఆలోచన నాలో బలంగా నాటుకుపోయింది. చివరకి ఆ రోజు రానే వచ్చింది.

తన ఊరికి ఎలా వెళ్ళాలా అని ప్లాన్ చేస్తూ ఉన్నా నేను. "రేయ్, అక్కడికి వెళ్ళాక తనది పెద్ద ఇల్లు అయితే? ఇంటినిండా కుక్కలు, ఉంటే? బాడీ గార్డ్స్ ఉంటే? వాళ్ళ చేత నిన్ను కొట్టిస్తే? అసలు ఇవన్నీ ఎందుకు, నువ్వక్కడికి వెళ్ళక ముందే..."  పక్కనుండి ప్రభు అన్నాడు.

"రేయ్ శని పరమాత్మా. నాలుక మీద మచ్చ ఉన్న మహానుభావా. ఒక్క రోజైనా కాస్త మంచి మాట్లాడరా. నీ..."
"అంటే అలా కాదు రా. అడ్రస్ కనుక్కోవడానికే నానా తిప్పలూ పడ్డాం. ఇంక కలవాలంటే..."

"రేయ్, అవన్నీ నాకు వదిలేయ్ రా నేను చూసుకుంటా.

"రేయ్, గుర్తు తెచ్చుకో. అడ్రస్ కోసమే గడ్డి తిన్నంత పని అయ్యింది. నాకెందుకో కీడు అనిపిస్తోంది రా. దయచేసి ఈ ప్లాన్ మార్చేయి." అన్నాడు ప్రభు.

వారం క్రితం తన అడ్రస్ కోసం ఏం చెయ్యాలా అని అనుకుంటుండగా గోపాల్ ఒక చక్కని ఐడియా ఇచ్చాడు. ప్రిన్సిపాల్ గదిలో ఉన్న రికార్డులలో తన అడ్రస్ దొరుకుతుందని, అందులోకి చొరబడగలిగితే మనకి దొరికినట్లే అని. కాని మేము దొరికిపోతే, మా బతుకులు నాశనమయిపోయినట్లే. మొత్తానికి నా పట్టుదలతో వాళ్ళని ఒప్పించి మేము "ఆపరేషన్ అడ్రస్" కోసం సిధ్ధపడ్డాము. ఆ రోజు రాత్రి స్టడీ అవర్ మధ్యలో మంచినీళ్ళ సాకు చెప్పి గోపాల్, బాత్రూం సాకు చెప్పి నేను తప్పుకున్నాం. ప్రభు ఏం చెప్పాడో తెలియదు కాని పావు గంట తర్వాత మాత్రం మాతో జత కలిశాడు. ముగ్గురం కలిసి ప్రిన్సిపాల్ గది బయట ఎదురుచూస్తూ ఉన్నాం. కాసేపాగి ఆయన రౌండ్స్ కోసం వెళ్ళారు. దొరికిందే సందు అని ముగ్గురం తలో పక్కా వెతకడం మొదలుపెట్టాం. చివరకి కష్టపడి సాధించాం. ఇంతలో మా కెమిస్ట్రీ లెక్చరర్ గొంతు వినిపించేసరికీ ఒక్కొక్కళ్ళకీ ముచ్చెమటలు పట్టాయి.

మేమిద్దరం వెళ్లి బల్ల వెనుక దాక్కున్నాం. గోపాల్ తలుపు దగ్గర సైంధవుడిలాగ అడ్డంగా నిలబడి ఆయన రాగానే "గుడీవినింగ్ సార్" అని ఆయన్ని బెదరగొట్టాడు. ఇక్కడేం చేస్తున్నావురా అని ఆయన అడిగితే "రేపు కెమిస్ట్రీ పరీక్ష కద సార్, అందుకని లాబ్ లో చదువుదామని ప్రిన్సిపాల్ గారిని అడగడానికి వచ్చా సార్. లాబ్ లో ప్రయోగాలు చేస్తూ చదివితే బాగా గుర్తుంటుందని నా తపన సార్." అని సెంటిమెంటుతో సిమెంటు గోడ కట్టాడు. ఆయన కరిగిపోయి లాబ్ తాళాలు ఇచ్చి "నువ్వు కుమ్మేయ్యరా గోపాల్. నీలాంటి స్టూడెంట్ ని నేనిప్పటిదాకా చూడలేదు. నువ్వు జీవితంలో ఎంతో పైకొస్తావు రా" అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ సన్నివేశం గుర్తొచ్చి గోపాల్ విచిత్రమైన సమయస్పూర్తికి నవ్వొచ్చింది. ఏది ఏమైనా సరే నేను మాత్రం కీర్తన విషయంలో తగ్గే సమస్యే లేదని ప్రభుకి తేల్చి చెప్పేసి నేను బయలుదేరాను.

తన ఇంటిదగ్గరకి వెళ్లి ఒక చెట్టు చాటుగా గమనిస్తూ ఉన్నాను. తను బయటికి వస్తుందా లేదా, వస్తే ఎలా, రాకపోతే ఎలా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నా బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. అంతలో నా గతం నా ముందు కనిపించినట్లు, మా తొలి కలయికలో తన్ను వేసుకున్న విధంగా పట్టు లంగా వోణీ లో తలస్నానం చేసి విరబోసుకున్న కురులతో బయటికి వచ్చింది కీర్తన. ఒక్కసారిగా నా గుండె కొట్టుకోవడం ఆగిపోయి తన నామస్మరణ మొదలుపెట్టింది. చేతిలో పువ్వులు, పళ్లు, కొబ్బరికాయ ఉన్న ఒక బుట్ట పట్టుకుని గుడికే అనుకుంట, బయలుదేరింది. తను అలా సందు తిరిగిన వెంటనే నేను తన వెంటే నడవడం మొదలు పెట్టాను.

చివరకు ఎవ్వరూ లేని ఒక చోటికి వెళ్లాకా గబాలున తన వెనక్కి వెళ్లి "హ్యాపీ బర్త్ డే కీర్తనా", అని అన్నాను. అనుకోని ఈ సంఘటనకి బెదిరిపోయిన తను నన్ను చూసి ఆశ్చర్యానికి గురైంది. ఇంతలోనే నన్నో పక్కకి లాగేసి 
"ఎందుకొచ్చావ్ అసలు నువ్వు. ఏమనుకుంటున్నావ్ నువ్వు నీ గురించి? ఇలాంటివి నాకు నచ్చవని చెప్పా కదా, అయినా సరే ఏంటిది?" అని అంది. ఇంకా ఇలాంటివి అంటూనే ఉంది.

తన కోపానికి దాసోహమైన నేను మెల్లగా తనకోసం కొన్న బహుమతిని ఒక గులాబి పువ్వుతో పాటు బయటికి తీసి, మోకాళ్ళ మీద కూర్చుని "నా హృదయ నర్తన, నా కీర్తనకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఐ లవ్ యూ కీర్తనా" అని అన్నాను. అప్పటికి కానీ తన కంగారుకు కారణం నాకు అర్థంకాలేదు.

"కీర్తనా, ఎవడే వాడు? రేయ్, ఎవడ్రా నువ్వు? ఆగక్కడ..." అంటూ గంభీరంగా ఓ గొంతు వెనకనుండి వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే కీర్తన వాళ్ళ నాన్నగారు.


ట్రింగ్ ట్రింగ్...
టక్... టక్... టక్...
"విక్రమ్, నీ సోది కాసేపు ఆపి ఎవరొచ్చారో చూడచ్చు కదా." లోపలినుంచి నా భార్య గొంతు.

నాన్నా, ఆ తర్వాత ఏం జరిగింది? చెప్పు నాన్నా... అన్నాడు సంజయ్

"నాన్నా, గీత ఆంటీ వచ్చింది." అంటూ పరిగెత్తుకొచ్చింది లాస్య, నా పదేళ్ల కూతురు. అప్పటిదాక నా పక్కనే కూర్చున్న తను అంతలోనే ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు తలుపు తీసిందో కూడా అర్థం కాలేదు నాకు.

"రేయ్ ఫూల్.." గోపాల్ గొంతు వినిపించింది.

"డాడీ, గోపాల్ అంకుల్ కూడా వచ్చారు." అన్నాడు సంజయ్, నా పదమూడేళ్ల సుపుత్రుడు.

హేయ్, గోపాల్, గీతా, రండి రండి.. సంజయ్, వెళ్లి అమ్మకి చెప్పి రా గోపాల్, గీత వచ్చారని.

"అంకుల్, ఇప్పుడే నాన్న మీ అందరి కథలు, కాలేజీ గాధలు చెబుతున్నారు" అని అంటూ లోపలికి వెళ్లాడు సంజయ్.

"నువ్వొకడివి. చెప్పిన కథనే ఎన్ని సార్లు చెబుతావు రా. విసుగనిపించదూ? నీ కొడుకు నిన్ను మించినోడు. ఎన్ని సార్లు విన్నా ప్రతీ సారీ ఏమీ తెలియనట్లు వాడూ, వాడి ప్రశ్నలు.. బానే ఉంది రా నీ పని. మీ ఇంటి మహా ఇల్లాలికి నిన్ను భరించే ఓపిక ఉన్నందుకు మెచ్చుకోవాలి. ఇంతకీ తనెక్కడ?" అన్నాడు గోపాల్.

లోపలినుండి బయటికొచ్చింది తను. కళ్లు కుట్టేసే చిలకాకుపచ్చని డిజైనర్ చీర, చీకటిని మైమరపింపజేసే విరబోసుకున్న నల్లని కురులు, హంసలకే ఈర్ష్య పుట్టించే సొంపైన తన నడక, దేవతలని తలపించే తన అందం, అన్నీ కలబోసి నా హృదయ దేవత, నా కలల రాణి, నా జీవిత భాగస్వామి, నా కీర్తన.


సమాప్తం


చివరి మాట: నాకు మూల కథను అందించిన నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ కి మళ్లీ మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా వ్రాతలని ప్రోత్సహించి నేను ఈ కథని వ్రాయటం కొనసాగించడానికి నాకు కారణభూతులైన నా మిత్రులందరికీ, ఈ కథని చదివి నాకు ఎన్నో సలహాలందించిన అందరికీ ధన్యవాదములు.
ఇంకా మీ అందరి ప్రోత్సాహంతో ఎన్నో కథలు, కవితలు, నవలలు, వ్రాసే స్పూర్తి నాకు కలగాలని కోరుకుంటూ, అందాకా సెలవు.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు..

Share on Google Plus

About ఉదయ్ శంకర్ యర్రమిల్లి

    Blogger Comment
    Facebook Comment

2 comments :