దీనికి ముందు తొలిప్రేమ - 2 ని చదవండి.
మొట్టమొదటి రోజు.. పొద్దున్నే లేచి 5 గంటలు చదవడంవలన మేమంతా క్లాసు మొదలయ్యేసరికీ మెదడు వాపు వ్యాధి వచ్చిన వాళ్లలాగా ఉన్నాము. కాకపోతే మొదటి క్లాసు కావడంతో అందరూ కాస్తయినా ఉత్సాహంతో ఉన్నారు. ఇంతలో టీచరు రానే వచ్చింది. రాగానే పరిచయం చేసుకుని మమ్మల్ని కూడా ఒక్కొక్కరినీ పరిచయం చేసుకోమంది. ఇక్కడిదాకా నాకు బాగానే అనిపించింది కానీ ఆ తర్వాత తన పూర్వానుభవం గురించి, తన గత విద్యార్థుల గురించి చెబుతుండగా నా బుర్రలో చక్రాలు తిరిగాయి. ఎక్కడో, ఎప్పుడో ఇలాంటి సంఘటనే జరిగినట్లు జ్ఞప్తికి వస్తోంది. ఇంతలో నేను అనబోయే మాట, దానికి ఆమె నామీద డస్టర్ విసరడం, భవిష్యత్తంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కొంపతీసి నేను ఇదివరకే కల గనలేదు కదా అని అనుకుంటూ ఉండగా, తెల్లవారుఝామున వచ్చే కలలు నిజమౌతాయన్న మా బామ్మ మాటలు గుర్తొచ్చి నోటిచివరిదాకా వచ్చిన నా డైలాగుని నాలుక కరుచుకుని, పైకి అనకుండా పక్కన కూర్చున్న గోపాల్ గాడితో గుసగుసలాడాను. అది చూసి ఆవిడ "హెలో యూ మిస్టర్ రెడ్ షర్ట్ చాలా హుషారుగా కనిపిస్తున్నావు.. ఒకసారి ఇలా రా" అని పిలిచింది. తేలమొహంతో చుట్టూ చూస్తున్న నన్ను "నిన్నే. ఇటు రావోయ్" అని అంది. బిక్కచచ్చిపోయిన నేను ఏమీ చెయ్యలేక డయాస్ మీదకి వెళ్లి నిలబడ్డాను. నన్ను చూపించి "ఇదిగోండి. ఇతనే ఇవాళ్టినుండి మీ క్లాస్ లీడర్" అని పరిచయం చేసి నా మెడలో మూర్ఛబిళ్లలా ఉన్న నా బ్యాడ్జిని చూసి నా పేరు పైకి చదివింది.
"విక్రమ్"
ఇంకేముంది? క్లాసంతా గోల. నా భాషలో చెప్పాలంటే రచ్చ. "ఏయ్, విక్రమ్..." అంటూ గేలి చేసేవారు కొందరు, "వీక్రమ్... వీక్రమ్... వీక్రమ్..." అని అరుస్తూ ఇంకొందరు, "పార్టీ ఎప్పుడు బాస్" అంటూ మరికొందరు, ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు అరుచుకుంటూపోతున్నారు. ఆసలే ఒకపక్క టీచర్ కంట పడినందుకు నేను ఏడుస్తుంటే ఇంకోపక్క వీళ్ల అరుపులు చిరాకు తెప్పిస్తున్నాయి. ఎటొచ్చీ కలలోలాగ కోప్పడకుండా ఉందిలే అని సంతోషించేలోపే నామీద పిడుగు పడింది.
"సైలెన్స్...!" అని గట్టిగా ఒకసారి అరిచి, "మాటలు మాట్లాడేవాడెప్పుడూ నాయకుడు కాలేడు. తను చెప్పాలనుకున్నది చేతల్లో చేసి చూపించగలిగేవాడే నిజమైన నాయకుడు."అంటూ ఉపన్యాసం మొదలుపెట్టింది. సందర్భోచితంకాని సంభాషణలు మనకెందుకని నేననుకుంటుంటే, "మీకు క్రమశిక్షణ బాగా తక్కువగా ఉందని నాకనిపిస్తోంది. కాబట్టి మీ నాయకుడిగా తాను పాటించి మీకు నేర్పించవలసిన బాధ్యత విక్రమ్ మీద ఉంది.. ఏం విక్రమ్? ఏమంటావ్??" అంటూ నావైపు చూసింది. ఏదో ఆవిడ చెప్పింది అర్థం కాకపోయినా, కొరివితో తల గోక్కోవడం ఎందుకని గంగిరెద్దులాగా తల ఆడించాను. "కాబట్టి, ఇప్పుడు నీలో క్రమశిక్షణ లొపించిన కారణంగా నువ్వు వెళ్లి క్లాసురూం బయట నిలబడుతున్నావ్.. ఊ.. వెళ్లు." అని కసిరింది ఆవిడ. ఇంకనుండి క్లాసులో ఎవరైనా అనవసరంగా మాట్లాడితే ఇదే జరుగుతుందని చెప్పడానికి మీ క్లాస్ లీడరే ఉదాహరణ. థాంక్యూ విక్రమ్" అంటూ ముగించింది. అప్పటికే అక్కడున్నవాళ్లందరికీ ఆమె ఎంత చండశాసనురాలో అర్థమైపోయింది.
అక్కడ జరిగిన సంఘటనకి, ఆమె మాట్లాడుతున్న మాటలకి సంబంధం ఏంటో అర్థంకాక బుర్ర గోక్కుంటూ నిస్సహాయస్థితిలో బయటికి వెళ్లి నించున్నాను. మొదటిరోజు, మొదటి క్లాసులో, అది కూడా అంతమంది అమ్మాయిలముందు, ఇంక మన పరువును పార్సిల్ చేసి పెన్నా నదిలో తోసెయ్యచ్చని అనిపించింది. ఇంతలో బ్యాగ్రౌండ్ లో "నీకేలా ఇంత నిరాశా" అంటూ జానకమ్మ పాడినట్లు వినిపించింది. "నా బతుకు" అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాను.
ఆ రోజు ఆ క్షణం నా జీవితంలో ఒక మరపురాని క్షణంగా మిగిలిపోతుందని నేనెప్పుడూ ఊహించలేదు. చెదిరిన నా కలలో జరగని ఆ అద్భుతమేదో అప్పుడు నిజంగా జరిగింది. మండుటెండలో చల్లని గాలి, పట్టీల చప్పుడు, మంచి గందపు సువాసన. ఆ పట్టీల అలికిడికి తలెత్తి చూసిన నాకు మేలిమిబంగారుఛాయలో ఉన్న పట్టులంగా, సూర్యకాంతిలా మెరిసిపోతూ ఎర్రటి వోణీలో ఒక అమ్మాయి కనిపించింది. స్వర్గలోకంనుండి దిగొచ్చిన దేవకన్యలా ఉంది. గాలికి ఎగురుతున్న ఆ ముంగురులను తన వేళ్లతో సవరించుకుంటూ అలా నడిచి వస్తుంటే చూసిన నేను శిలనైపోయాను. మరోపక్క నా మనసు ఆమెవైపు పరుగులు తీస్తోంది. అలా నడుచుకుంటూ ఆ అమ్మాయి నా ముందుకి వచ్చి నిలబడింది. ఒక్కసారిగా తేరుకున్న నేను తన ముఖంలోకి చూస్తూ మాటలురాక ఒక సన్నని నవ్వు వదిలాను. దానికి విస్మయం చెండి నావైపే చూస్తూ ఏదో అడగబోయి అలా ఉండిపోయింది. విచిత్రంగా ఉన్న ఆమె భావాలు నాకు అర్థంకాకుండా పోయాయి. ఈ గడబిడలో ఉన్న నాకు లోపలనుండి మా టీచర్ అరుపు వినిపించింది. "నాన్నా విక్రమ్. నువ్వు తలుపు దగ్గర కాపలా కాస్తున్నావ్, బాగానే ఉంది. కాస్త పక్కకి జరిగితే, ఆ అమ్మాయి కనీసం లోపలికైనా వస్తుంది."
అప్పుడు నాకు బుర్రలో వెలిగింది. ఆ అమ్మాయి కూడా నా క్లాసే అని, తను లోపలికి వెళ్లడానికి నేను అక్కడ అడ్డంగా ఉన్నానని. ఇంక ఒక నిట్టూర్పు విడిచి పక్కకి జరిగి తనని లోపలికి వెళ్లనిచ్చాను. ఆ గంటసేపు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఆ గంటలోపు ఆ ఇంట్రడక్షన్ సీన్ నా మనసులో ఎన్నిసార్లు రీప్లే అయ్యిందో నాకే తెలియదు. చివరకు ఆ క్లాసు ముగిశాక మనకి ద్వారపాలక వృత్తినుండి విముక్తి కలిగింది.
ఆ తర్వాతి క్లాసు కూడా మొదలయ్యిందికాని నా మనసు మనసులో లేదు. ఆమె కూర్చున్న బెంచి చుట్టూ ఇప్పటికే ఓ లక్ష ప్రదక్షిణలు చేసుంటుంది. అలా ఓలలాడుతున్న నా మనసు ఆ అమ్మాయి పేరు తెలుసుకోవడంకోసం తపిస్తోంది. ఇంతలో మా ఫిజిక్స్ టీచర్ రానేవచ్చారు. మళ్లీ అటెండన్స్ తీసుకుంటారు కదా, పేరు తెలిసిపోతుంది అని అనుకుంటుండగా, "ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ది క్లాస్. సో, అటెండన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మి. ఎనీవే గయ్స్, లెట్స్ స్టార్ట్ ది లెసన్ ఫర్ ది డే. ఐ విల్ కలెక్ట్ యువర్ అటెండన్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ క్లాస్ టీచర్. ఐ డోంట్ లైక్ వేస్టింగ్ టైమ్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్." అని ఆయన అన్నారు. "ఆటెండన్స్ అవసరం లేనప్పుడు మళ్లీ ముందు క్లాస్ టీచరు నుండి ఎందుకో తీసుకోవడం..." అని అనుకున్నా.. ఏది ఏమైనా, నాకంటూ ఒక మంచి పని దొరికింది. దాంతో ఇక అందులో నిమగ్నమైపోయాను.
కన్నార్పకుండా ఆమెవైపు అలా చూస్తూ ఉండిపోయా. మధ్యమధ్యలో తన వైపు ఎవరో చూస్తున్నట్లు అనుమానంగా వెనక్కి తిరిగి చూసేది. అప్పుడు మాత్రం చూపును పక్కకి తిప్పుకుని, మిగతా సమయమంతా తన వైపే చూస్తూ రోజంతా గడిపేశాను. నా ఖర్మకొద్దీ ఆ రోజు ఎవ్వరూ అటెండన్స్ తీసుకోలేదు. దాంతో తన పేరు తెలియలేదన్న బాధ, తెలుసుకోవాలన్న ఆరాటం.
ఇంక సాయంత్రం రూంకి వచ్చాక అలా ఆమె పేరు ఏమయ్యుంటుందో అని ఊహించుకుంటూ పరధ్యానంగా ఉండిపోయాను. ఇది చూసి మా ప్రభు నేనేదో టీచర్ తిట్టినందుకు బాధపడుతున్నాననుకుని నన్ను ఓదార్చే పనిలో పడ్డాడు. నేను క్లాస్ లీడర్ ని కాబట్టి కాస్త సులువుగా ఆవిడని మెప్పించవచ్చని, కొంచెం సత్ప్రవర్తనతో మెలగితే నా మీద పడ్డ మచ్చ మాసిపోతుందని, ఎదెదో చెబుతూ ఉన్నాడు. ఇక మా గోపాల్ గాడికి పూర్వానుభవం అనేది ఒకటి ఉంది కదా, దాంతో ప్రభుని వెళ్లగొట్టి నా దగ్గరికి వచ్చి "ఎవర్రా అమ్మాయి??" అని అడిగేశాడు. పాపం ఒక్కసారిగా 'అమ్మాయి' అన్న పదం విని మా ప్రభు అవాక్కయ్యాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తన దారి తను చూసుకున్నాడు. ఇంక అదే అదునుగా నేను ఆ అమ్మాయి పేరేంటో గోపాల్ ని అడిగాను. వాడు తక్కువవాడా.. నేను ఊహించినట్టే, తెలియదన్నాడు. పైగా నాకు పేరు చెబితే తనకేంటి అని బేరం మొదలుపెట్టాడు. ఇంక అన్ని రకాలుగా ప్రయత్నించి, చివరికి వాడికి కాంటీన్ లో సమోసా ఇప్పిస్తానంటే పేరు చెప్పాడు.
"కీర్తన".
ఆ పేరు వినగానే నా గుండెల్లో వెయ్యి వీణలు ఒకేసారిగా మ్రోగినట్లైంది. నేను తన్మయత్వంతో "కీర్తన.. కీర్తన... ఆ అమ్మాయి, ఆ అందం, ఆ అందానికి తగ్గట్లు ఆ పేరు, ఎంత అందంగా ఉందిరా ఆ పేరు... నిజంగానే నా మనసులో ఒక కీర్తన పాడుతున్నట్లు ఉంది... కీర్తన విక్రమ్.. ఆహా.. వావ్.. సుపర్బ్.. ఏం కలిశాయి రా..." అంటూ నేను కలల లోకంలో మునిగిపోయాను.
"ఓయ్.. చాలు చాల్లే.. పొగిడింది చాలు.. భోజనానికి వెళ్దాం పద" అని గోపాల్ నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ఇంక మెస్ కి వెళ్లి ఆ రాత్రికి భోజనంచేసి వచ్చి పడుకున్నాను.
ఇంక ఆ తర్వాత అన్ని రోజులూ ఒకేలాగే ఉన్నాయి. గోపాల్ ఒక సంవత్సరంలో సంపాదించిన అనుభవాన్ని ఒకే రోజులో సంపాదించిన నేను, ప్రతిరోజూ ఆమె చూపులను ఆస్వాదిస్తూ ఆమె ఊహలలో గడిపేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడూ గోపాల్ నా లోకంలోకి వచ్చి "రేయ్, నీకు అంతగా ఇష్టం ఉంటే వెళ్లి చెప్పేయ్ రా. తనంటే నీకిష్టమని. ఆలస్యం చేస్తే ఎవడో వచ్చి తన్నుకుపోతాడు" అని నాకు ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాడు. దాంతో ఓ నెలరోజులపాటు నేను, కీర్తన, నా ఊహలు, మధ్యలో మా గోపాల్ గాడి ఉచిత సలహాలు, ఇదే నా లోకం.
అప్పుడు ఎదురైంది, నా జీవితంలో మరొక మలుపు.
(సశేషం)
అత్యద్బుతంగా రాసావు!! నీ వర్ణన అమోఘం! రచయితగా మంచి బవిష్యత్తు ఉంది! చిత్ర పరిశ్రమ నీకు సరియినది! ఇంతకీ నీ సొంత అనుభవాలా??
రిప్లయితొలగించండిrama krishna
అత్యద్బుతంగా రాసావు!! నీ వర్ణన అమోఘం! అసలు ఆ అమ్మాయిని వర్ణించిన తీరు అత్యాద్బుతం! రచయితగా మంచి బవిష్యత్తు ఉంది! చిత్ర పరిశ్రమ నీకు సరియినది! ఇంతకీ నీ సొంత అనుభవాలా??
రిప్లయితొలగించండిrama krishna
" మండుటెండలో చల్లని గాలి, పట్టీల చప్పుడు, మంచి గందపు సువాసన. ఆ పట్టీల అలికిడికి తలెత్తి చూసిన నాకు మేలిమిబంగారుఛాయలో ఉన్న పట్టులంగా, సూర్యకాంతిలా మెరిసిపోతూ ఎర్రటి వోణీలో ఒక అమ్మాయి కనిపించింది. స్వర్గలోకంనుండి దిగొచ్చిన దేవకన్యలా ఉంది. గాలికి ఎగురుతున్న ఆ ముంగురులను తన వేళ్లతో సవరించుకుంటూ అలా నడిచి వస్తుంటే చూసిన నేను శిలనైపోయాను. " ..... Kewww
రిప్లయితొలగించండిగోపాల్ ఒక సంవత్సరంలో సంపాదించిన అనుభవాన్ని ఒకే రోజులో సంపాదించిన నేను...too much ra Vikram...ekkadiko vellipoyav...akasam anchuladaaka vellipoyaav...akkada nundi..... :)
రిప్లయితొలగించండిసింపుల్ గా నీ బాష లో "రచ్చ"
రిప్లయితొలగించండిsoon i ll come up with one as such
రిప్లయితొలగించండిstory oldey(emilekapoyina!!) nee description super!!gr8 goin.
రిప్లయితొలగించండిInteresting. Well written as usual.Happy Season.
రిప్లయితొలగించండిadirindayya y s s s uday shankar
రిప్లయితొలగించండిadirindayya y s s s uday shankar
రిప్లయితొలగించండి