ఈ రోజుల్లో పిల్లలు పుట్టకముందు నుండే వాళ్లకి ఇంగ్లీషు నేర్పించాలని ప్రతి తల్లీ తండ్రీ ఉవ్విళ్లూరుతున్నారు. ఆంగ్ల భాష మాట్లాడటం తప్పేమీ కాదు, కానీ మాతృభాషని మర్చిపోకుండా ఉంటే చాలు. ఈ తరం పిల్లలకు "తారంగం తారంగం తాండవకృష్ణా తారంగం" పద్యం తెలీదు కాని, "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అంటే అందరికీ తెలుసు. పొట్టి శ్రీరాములు గారు తెలీదు కాని పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ తెలుసు. ఇక్కడ తప్పు ఎవరిది అని చెప్పడమో, లేక వాదోపవాదాలకి తావినివ్వడమో నా ఉద్దేశం కాదు. కేవలం మన భాషని బ్రతికించమని మనవి చెయ్యడమే ఒక తెలుగువాడిగా నా బాధ్యత అనుకుంటున్నాను.
మీకు గుర్తుంటే, మనకి చిన్నప్పుడు "తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం" అని ఒక పద్య రూపంలో ఉన్న పాట ఒకటి ఉండేది. మొన్నీమధ్య జరిగిన FIFA 2010 ఫుట్ బాల్ టోర్నమెంట్ లో "పాల్" అనే ఒక ఆక్టోపస్ జోస్యం చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే. ఇది విన్నప్పుడు నా మనసులో ఈ పాట గుర్తొచింది. "చిలక పోయి ఆక్టోపస్ వచ్చె ఢాం ఢాం ఢాం" అని. అందుకే, ఈ బ్లాగు.
ఇక విషయానికొస్తే ఇటీవలే తెలిసిన వార్త ఏంటంటే ఇది జరిగినప్పటినుండీ మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పెంపుడు జంతువుల దుకాణాలన్నిటిలో ఆక్టోపస్ ల కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగుతున్నారని సమాచారం. ఆక్టోపస్ లు దొరకడం కష్టమని కొందరు, దొరికినా అంత ధర భరించడం కష్టమని మరి కొందరు, పెంపుడు ఆక్టోపస్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టటానికి సిద్దమని ఇంకొందరు, ఇలా ఎవరికి వారు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఆక్టోపస్ లను పెంచుకోవడం ఎంతవరకూ చట్టబద్దం అన్నది ఇంకొక ప్రశ్న.
Convention on International Trade in Endangered Species (CITES) లో Appendix 1 లో ఆక్టోపస్ జాతి జంతువులను పెంచుకోవడం చట్టరీత్యా నేరమని ఉంది. ఐతే దీనికున్న గిరాకీకి చట్టవ్యతిరేకంగా దిగుమతి చేసి ఇక్కడ అమ్మకాలు జరిపే అవకాశం కూడా లేకపోలేదు. WWF (World Wildlife Fund) వారికి ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. ఆక్టోపస్ ల వేటగనుక వీరందరూ ఊహించిన రీతిలో జరిగినట్లైతే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని వీరి అభిప్రాయం. ఏది ఏమైనా సరే, ఎవ్వరేం చేసినా సరే, ప్రాణికోటికి నష్టం కలిగించకుండా ఉన్నంతవరకూ సమర్ధించవచ్చు. ప్రకృతిలో సమతౌల్యానికి భంగం కలిగించే విధంగా ఉన్నదాన్ని సమర్ధించడం సాటి మానవులుగా ఎంతమాత్రమూ సమంజసం కాదు.
Starting a telugu blog is a nice initiative :) . Keep going :) .
రిప్లయితొలగించండి